మోర్తాడ్/వేల్పూర్/ఏర్గట్ల, జూలై 17: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలోని బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గల్ఫ్ ఫోరం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తన అనుచరులతో ఎమ్మెల్యే ఇంటిలోనికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో వేల్పూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పథకాల అమలుపై కొంతకాలంగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తదితరులు స్పందిస్తూ వేల్పూర్‌కు వస్తామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు సైతం ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వేల్పూర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేత లు షాపుల్లో, సందుల్లో దాక్కున్నారు. వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఉద్రిక్త పరిస్థితుల నడుమ వేల్పూరులోని ఎమ్మెల్యే వేముల నివాసంలోకి కాంగ్రెస్ కార్యకర్త చొరబడి విధ్వంసం సృష్టించాడు. కాంగ్రెస్‌కు చెందిన గల్ఫ్ ఫోరం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి నేరుగా మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడున్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు. దీనిని గమనించిన బీఆర్ఎస్ నాయకులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాసేపటికే మరికొంత ఎమ్మెల్యే ఇంటివైపు దూసుకొచ్చారు.
వారిని కూడా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ బందోబస్తు ఉండగా, ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ వర్గీయుడైన దేవేందర్‌రెడ్డి ఎలా వచ్చాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, తొలుత గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు వచ్చారన్నది చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి గర్హనీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ప్రశాంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ గూండాలు దాడులు ఆపకుంటే బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు.
హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే ఇండ్లపై దాడులు చేస్తరా? ఇదే నా రాహుల్‌గాంధీ చెబుతున్న మొహబ్బత్ కీ దుకాన్? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు మరో ప్రకటనలో ప్రశ్నించారు. వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సవాల్ చేసి మరీ ప్రతిపక్ష నేతల ఇండ్లపై అధికార పార్టీ వర్గీయులు దాడులు చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
మోర్తాడ్/వేల్పూర్, జూలై 17: అధికార పార్టీ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు ఇండ్లపై దాడి చేస్తరా? ఇది సభ్యతా? రాజకీయాల్లో ఇది మంచిదేనా? ఇలా దాడులు చేయడం వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగని ఇలా దాడులు చేసుకుంటూ పోతారా? అని నిలదీశారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్ఆర్ఐ సం క్షేమ బోర్డుతోపాటు గల్ఫ్ కార్మికుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని తాను ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు.
‘కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాఇంటి మీదికొస్తానని సవాల్ విసిరిండు. ఇవాళ మాఇంటి మీదికి కొందరు కాంగ్రెస్ వర్గీయులు వచ్చి దాడిచేశారు. మానాల మోహన్‌రెడ్డికి ఇప్పుడు కడుపు సల్లబడిందా?’ అని ప్రశ్పించారు. ‘మోహన్రెడ్డీ మీ గుర్తింపు కోసం నా ఇంటిపై దాడికి వస్తే, ప్రజలకి జరిగే లాభమేమిటి? ఒరిగిందేమిటి?’ అని నిలదీశారు.