హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తేతెలంగాణ): కంచె గచ్చిబౌలి భూముల సెగ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాకింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి కాంగ్రెస్ పెద్దలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. హెచ్సీయు వివాదం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నదని వారు తలలుపట్టుకుంటున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల జాతీయ స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, రాహుల్‌గాంధీ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈ వివాదంపై తాజా పరిస్థితులను పార్టీ నేతల ద్వారా తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ వివాదం కాంగ్రెస్ ప్రతిష్ఠను.
రాహుల్‌గాంధీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ ఆందోళన చేస్తున్న సమయంలో..రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం ఏమిటని అధిష్ఠానం పెద్దలు తప్పుపట్టినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడం, విద్యార్థులతో సమావేశం కావడం, వారికి ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటున్న విద్యార్థులు.. ప్రస్తుత పరిస్థితిపై ఆయనకు వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నట్టు తెలిసింది.