హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు మోసపూరితమైనవే అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి 2004లో బీఆఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని, 2009 తర్వాత కేసీఆర్ నేతృత్వంలో పోరాటం ఉధృతం కావడం, వందలాది మంది యువకుల బలిదానాల తర్వాత 2014లో తెలంగాణ ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమయ్యిందని ధ్వజమెత్తారు.
దాదాపు 60 ఏండ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, ఏ ఒక పథకాన్ని సరిగ్గా అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. కాంగ్రెస్ ట్రాక్ రికార్డు బాగా లేదని, ప్రజలు ఆ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని, అభివృద్ధి బీఆర్ఎస్ ట్రాక్రికార్డ్ అని చెప్పారు. బీఆర్ఎస్ను అవినీతి పార్టీ అని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆమె తీవ్రంగా ఖండించారు. స్థానిక నేతలు రాసిచ్చే స్రిప్ట్ను సరిచూసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రూ. 80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.