హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలకు ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాల్సిందేనని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తేల్చిచెప్పినట్టు తెలిసింది. గతంలో కూడా సుస్మిత ఇవే తరహా వ్యాఖ్యలు చేశారని, ఆమె ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కమిటీ నివేదించినట్టు సమాచారం.
కుమార్తె చేసిన చర్యలను తల్లి ఖండించకపోవడం క్షమార్హం కాదని కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సోమవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌కు అందించినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను మహేశ్ గౌడ్ ఏఐసీసీకి పంపనున్నట్టు సమాచారం.
కొండా సురేఖ ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలు చేసిన సందర్భంలో సహజ న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి సురేఖ వాటిని ఖండించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఎవరు తప్పుడు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం. అంతకుముందు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపైనే సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తున్నది.