Telangana Guarantees | హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై తెలంగాణ ప్రభావం ఉన్నదా? ఇక్కడి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను చూసిన మహా ప్రజలు.. అసలు కాంగ్రెస్‌నే తిరస్కరించారా? గ్యారెంటీలు, వారెంటీల గారడీని జనం నమ్మలేదా? అందుకు సీఎంతోపాటు మంత్రివర్గం మొత్తాన్ని అక్కడ మోహరించినా ఫలితం రాలేదా? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకుల్లో అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలపై, కాంగ్రెస్ ఓటమిపై తెలంగాణ ప్రభావం కచ్చితంగా ఉన్నదని చెబుతున్నారు. మహారాష్ట్రలో మెజార్టీ నియోజకవర్గాలు తెలుగువారి ప్రభావం ఉన్నవే. తెలంగాణతో సరిహద్దులను పంచుకోవడంతోపాటు కుటుంబ బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు కలిగిన నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఏడాదిలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు.. అక్కడ ప్రభావం చూపాయని విశ్లేషకులు తేల్చిచెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై జోరుగా చర్చ జరిగింది. కాంగ్రెస్ జాతీయ నేతలు తెలంగాణ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు ఏకరువు పెట్టారు. తెలంగాణ సీఎం, మంత్రుల ప్రచారాల్లో వీటిపైనే దంచికొట్టారు. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొచ్చారు. ఎగ్గొట్టిన హామీలపై మాట్లాడకుండా అరకొరగా అమలుచేసిన హామీలనే చెప్పుకోసాగారు. రుణమాఫీ పూర్తి చేశామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నామని ఇలా పలు రకాల గ్యారెంటీలపై ప్రచార సభల్లో వివరించారు. ఈ గ్యారెంటీల గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మనేలేదు. తెలంగాణ సరిహద్దులు, బంధుత్వాలు, తెలుగు ప్రజలు సెటిలైన ప్రాంతాల్లో తెలంగాణలో ఆరు గ్యారెంటీలు సక్రమంగా అమలుకాని విషయం తెలిసిపోయింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలపై కోతలు పెట్టిన విషయమూ తెలిసింది. అరకొరగా గ్యారెంటీల అమలు, పాత పథకాల రద్దు అంశాలూ తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందనే చర్చ ప్రజల్లో జోరుగా జరిగింది. ఈ కారణాలతో అక్కడి ప్రజలు ఆరు గ్యారెంటీలను, తెలంగాణ నేతల మాయమాటలను పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా అట్టర్‌ఫ్లాప్ అయ్యారనే విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం తెలంగాణ మంత్రివర్గం మొత్తం మహారాష్ట్రలో మకాం వేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మరట్వాడ రీజియన్‌కు సీనియర్ అబ్జర్వర్‌గా నియమించింది. మరో మంత్రి సీతక్కను సీనియర్ అబ్జర్వర్గానూ నియమించింది. వీరితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలా మంత్రులంతా మహారాష్ట్రలో ప్రచారం చేశారు. రోజుల తరబడి అక్కడే ఉంటూ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ పథకాలు, అరు గ్యారెంటీలపై విస్తృత ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఫలించలేదు. అసలు తెలంగాణ సీఎంతోపాటు మంత్రుల ప్రచారం కాంగ్రెస్ కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పాలనలో విఫలమైన నేతలు మహారాష్ట్రకు ఏం చెప్తారని అక్కడి ప్రజలు విశ్వసించలేదు. ముఖ్యంగా వీళ్లను చూసే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.