KTR | ఎన్నడన్న ఒక్కరోజన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? అవకాశం ఉంటే కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణను చిన్నగ చేసి చూపెట్టాలనే ప్రయత్నం చేశారు తప్పా.. రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు. తెలంగాణ న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఇది కావాలి.. అది రావాలని అని రాహుల్ గాంధీ కానీ, నరేంద్ర మోదీ అయినా మాట్లాడారా గుర్తు తెచ్చుకోవాలి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే.. తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు.
‘మన దళం ఉండదు.. మన గళం ఉండదు. మళ్లీ అనామకులుగా.. ఎట్లయితే తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించారో.. రేపు పార్లమెంట్లో కూడా వినిపడకుండాపోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని కోరుతున్నా. ఇతర రాష్ట్రాల్లో వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుతారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఎన్ని ఉన్నా తమిళనాడులో.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలు అందరూ ఒక్కటవుతారు. దురదృష్టం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రమంటే.. ఇక్కడ మంచి జరిగితే మొత్తం క్రెడిట్ అంతా కేసీఆర్‌కు పోతది.. కాబట్టి ఎట్లనన్న ఈ రాష్ట్రానికి ఏం రాకపోయినా.. నష్టం జరిగినా పర్లేదు కానీ.. తెలంగాణ ముందుకుపోవద్దు అన్నట్లు.. ఎన్నడూ తెలంగాణ జెండాను, ఎజెండాను పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తావించిన పాపాన గతపదేళ్లో పోలేదు’ అన్నారు.
‘పార్లమెంటరీ పార్టీలు మీటింగ్‌లు జరుగుతాయి. ఎన్నడన్నా ఒక్కరోజు గత పదేళ్లలో ఆ పార్టీల పార్లమెంటరీ పార్టీల మీటింగ్‌లో తెలంగాణ అనే పదం వినపడ్డదా? ఆలోచించాలి. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కన్నప్పుడు.. అన్యాయం జరిగినప్పుడు అడిగేది.. ప్రశ్నించేది.. కలబడేది.. నిలబడేది కేసీఆర్ దళం మాత్రమే. వినబడేది కేసీఆర్ దళం గళం మాత్రమే. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉన్నది. రేవంత్‌రెడ్డిని బండి సంజయ్ పొగుడుతున్నరు. ఇద్దరు అవగాహనకు వచ్చినట్లున్నారని, గతంలో కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో అంతర్గత ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేశారో.. మళ్లీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన అవగాహనకు వచ్చినట్లుగా అనిపిస్తున్నది. అందుకే మేం అనేది.. వాళ్లు వారి ప్రయోజనాల కోసం ఎంతకైనా పోతారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే.. ఇందుకోసం ఢిల్లీలో పని చేయాలంటే ఆ పని బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలగుతరు తప్ప ఇంకెవరి వల్ల కాదు’ అని స్పష్టం చేశారు.
‘కేసీఆర్‌కు బలం ఇద్దాం.. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిద్దాం.. గులాబీ దళాన్ని పార్లమెంట్‌కు పంపుదాం.. ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మరోసారి పెంచుకుందాం. తెలంగాణ గౌరవాన్ని, అస్థిత్వాన్ని కాపాడాలంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలవాలి. మొన్నటి చిన్న చిన్న కారణాలపై సమీక్షిస్తున్నాం. మార్పులు, చేర్పులు పార్టీ చేసుకోవాలో.. అవన్నీ చేసుకుంటాం. మా వళ్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు.. లోటుపాటు అన్నింటినీ సరిదిద్దుకునే దిశగా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు చూస్తారు’ అన్నారు.
‘తెలంగాణలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉన్నది. కొత్త ప్రభుత్వం ఏదైతో వచ్చిందో.. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు.. 420 హామీలు ఇచ్చారు. ఇప్పటికే ఎత్తగొట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ఎన్నికల వాగ్ధాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరుతో డైవర్షన్ పేరుతో డ్రామాలు. ల్యాండ్ క్రూజర్లు అని కథలు పుట్టించి.. కేసీఆర్ సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్లు డ్రామాలు చేశారు. ప్రభుత్వానికి, మంత్రులకు, ఇక్కడ పని చేసేవారికి భద్రత కోసం విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను తొడిగించేందుకు పంపితే విజయవాడలో దాచిపెట్టారని సిల్లీగా మాట్లాడారు. ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నరు. వాళ్లు ఇచ్చిన 420 హామీలను ఎగవేసేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో అభిప్రాయానికి వస్తున్నరు. తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించారు’ అని విమర్శించారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూడా బద్నాం చేసే చిల్లర ప్రయత్నం కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టు, రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వ్యవసాయ విస్తరణ జరిగినా.. జరగనట్లు.. అభూతకల్పన అన్నట్లు చిత్రీకరించారు. యాసంగిలో 3.5కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే.. అదికూడా జరగలేదు అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని.. తెలంగాణ ఓ విఫల ప్రయోగంగా, రాష్ట్రంగా ప్రయత్నం చేస్తున్నారో అది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలకోరు రాజకీయం ఎవరికీ మంచిది కాదు. వాస్తవం ఏంటంటే.. ఇవాళ దేశంలో దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ.. పొరపాటున వాళ్లు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే.. రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడుతున్నరు. దేశంలో దివాళా తీసిన పార్టీకి.. ఏదో అనుకోకుండా అవకాశం వస్తే.. రాష్ట్రమే దివాళా తీసిందంటూ దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నరు. ఇవి మంచిది కాదు’ అన్నారు.
‘అందుకే తెలంగాణ ప్రజలను కోరేది.. బీఆర్ఎస్ దళం, గళం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్‌కు అప్పగిస్తే అక్కడుండే.. 50-60 మంది ఎంపీల్లో వీళ్లు ఒకరో ఇద్దరో పోయి కూర్చుంటారు. రాహుల్ గాంధీ కూర్చోమంటే కుర్చుంటారు. నిలబడమంటే నిలబడతారు. వీరితో అయ్యేది ఏమీ కాదు. ఏం చేయడం చేతకాక.. ఎదుటివారిపై తప్పును నెట్టి తప్పించుకుందామనే చిల్లర ఎత్తుగడ తప్ప.. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నింటిని పోగేసి అప్పులనీ.. తప్పులనీ, ఆర్థిక స్థితి బాగాలేదని.. కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారు. కాంగ్రెస్ వాగ్ధానాలపై ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు బ్రహ్మాండంగా పడుతుండే.. ఇవాళ అతీలేదు గతీ లేదు.. అడ్రస్ లేదు అనే మాట మాట్లడుతున్నరని కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత పడ్డదో ప్రెస్‌నోట్ విడుదల చేస్తుండే. కాంగ్రెస్ వచ్చాక.. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని నాయకులు చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు.