నయీంనగర్, డిసెంబర్ 27: మహిళలు అని కూడా చూడకుండా ‘మిమ్మల్ని కాలనీలో ఉండకుండా చేస్తా.. మీరెంత మీ బతుకులెంత..’ అని వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత భర్త జక్కుల వెంకటేశ్వర్లు బెదిరింపులకు గురిచేసిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం .. నగరంలోని కోమటిపల్లిలోని నక్షత్ర కాలనీకి సంబంధించిన రోడ్డు విషయంలో 80 గజాల ప్లాట్‌కు గతంలో కాలనీ సభ్యత్వం నుంచి రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.
మిగతా డబ్బులు కాలనీ బిల్డర్ల దగ్గర వసూలు చేసుకుని ప్లాట్‌ను వెంకటేశ్వర్లు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయంపై కాలనీవాసులు పలుమార్లు పశ్నించారు. దీంతో జక్కుల వెంకటేశ్వర్లు మరికొంతమందితో కలిసి కాలనీ అధ్యక్షుడైన రిటైర్డ్ హెడ్మాస్టర్ వల్లాల సదానందంపై దాడిచేశారు. కాలనీ వాసులు అతడిని నిలదీయగా మహిళలు అని కూడా చూడకుండా ‘మీరెంత.. మీ బతుకులు ఎంత ..’ అని దుర్భాషలాడాడు. దీంతో కాలనీవాసులు కార్పొరేటర్ భర్తతో సదానందంకు ప్రాణభయం ఉందని, కేయూ పోలీసు స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు. ఈ మేరకు సీఐ రవికుమార్ కార్పొరేటర్ భర్తతో పాటు మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.