హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తేతెలంగాణ): నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు తెచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకుల వ్యవస్థపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి అవగాహన లేదని విమర్శించారు. అం దుకే 21 నియోజకవర్గాల్లో ఇంటిగ్రెటేడ్ స్కూ ళ్లను నిర్మిస్తున్నామని చెబుతున్నారన్నారు.
‘కేవలం రూ. 25కోట్లతో 2560 మంది విద్యార్థులకు ఒకేచోట భవనాలు ఎలా నిర్మిస్తారు? స్కూళ్లేమైనా కోళ్ల ఫారాలా? విద్యార్థులను కోడిపిల్లలనుకుంటున్నారా? అసలు మీరెప్పుడైనా గురుకుల విద్యార్థుల వద్దకు వెళ్లారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గ్యారెంటీలపై దృష్టి మళ్లీంచేందుకే ఇంటిగ్రెటేడ్ స్కూళ్లను తెరపైకి తెచ్చారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో గురుకులాలను నిర్మించి అన్నివర్గాల పిల్లలకు చదువుకొనే అవకాశం కల్పించిందని చెప్పా రు. కానీ కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు గురుకులాల్లో సామాజిక న్యాయం పాటించలేదని, 666 స్కూళ్లల్లో కనీస వసతులు కల్పించలేదని సీఎం రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 662 గురుకులాల్లో మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలకు క్రేజ్ తగ్గిందన్నారు. పిల్లలకు రగ్గులు, టీచర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. ఈ ఏడాది మెడికల్, ఐఐటీ సీట్లు సాధించిన 160మంది విద్యార్థులకు చిల్లిగవ్వ కూడా ఇ వ్వలేదని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్, నరేందర్ ఉన్నారు.