హైదరాబాద్ సిటీ బ్యూరో/ ఖైరతాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సమగ్ర కులగణన పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధి ప్రొఫెసర్ కే మురళీమనోహర్ విమర్శించారు. బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సో మాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం కులగణనపై పీపుల్ కమిటీ సమావేశం నిర్వహించారు. మురళీమనోహర్ మాట్లాడుతూ.. సమగ్ర కులగణన పేరిట సీఎం రేవంత్, మంత్రులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
అసెంబ్లీలో రేవంత్ ప్రవేశపెట్టి న కులగణన నివేదికలో అబద్ధాలు మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు. బీసీ కులగణన చేపట్టాలన్న రాహుల్‌గాంధీ ఆశయాన్ని కాంగ్రె స్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. 2014లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీల జనాభా 52 శాతం ఉన్నట్టు తేలితే.. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 46 శాతానికి ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.
సర్వే కమిటీకి మంత్రి ఉత్తమ్‌ను నియమించినప్పుడే కులగణనపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేలిపోయిందని బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీలు ఉద్యమం చేపడతారనే భయంతోనే నామమాత్రపు సర్వే చేసినట్టు ఆరోపించారు.
రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించి, ఓసీల సంఖ్య పెంచుకుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచుకోవడానికే కాంగ్రె స్ ప్రభుత్వం సర్వే చేసిందని ఆరోపించారు.
బీహార్, కర్ణాటక తరహాలో జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ ఏర్పాటు చేసి మళ్లీ కులగణన చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం నామమాత్రంగా సర్వే చేయడంతో రాష్ట్రంలో 3% కుటుంబాలు పాల్గొనలేకపోయాయన్నారు.
బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 42% సీట్లిస్తామని రేవంత్ ప్రకటించారని దుయ్యబట్టారు. ఓడిపోయే స్థానాల్లో బీసీలకు సీట్లిచ్చా రని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే పార్టీలో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.