సిద్దిపేట, జూన్ 19 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టిన రోజునాడే రేవంత్‌రెడ్డి ఆ రైతు డిక్లరేషన్‌కు బొందపెట్టిండని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. డిక్లరేషన్‌లో అన్ని పంటలకు ఎమ్ఎస్పీ తో పాటు అదనంగా రూ.500 ఇస్తామని చెప్పి నేడు బోనస్ లేదు.. అన్ని పంటలను మద్దతు ధరకు కొనము అని ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఇతర సీనియర్ నాయకులతో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి నాడు ఎన్ని వడ్లయినా పండించండి.. అంతా కొంటమని చెప్పిండు. ఇప్పుడు కేంద్రం ఏ పంటలు కొనుమంటే అవే కొంటం.. ఎంత కొనుమంటే గంతే కొంటమని నాలుక మడతేసిండు. అటు రాహుల్, ఇటు రేవంత్ ఇద్దరూ రైతులకు ఇచ్చిన మాట తప్పుతున్నరు’ అని దుయ్యబట్టారు. కేంద్రం ఎంత కొనుమంటే గంతే కొంటామంటే మీరెందుకు అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు మద్దతు మీద రూ.500 బోనస్ అని చెప్పారని, ఇప్పుడు బోనస్ ఎగబెట్టారని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవడమే
కేంద్రం ఏ పంట ఎంత కొనుమంటే గంతే కొంటామనడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అవుతుందని హరీశ్‌రావు విమర్శించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాలా జాగ్రత్తగా చెప్తున్నారని తెలిపారు. ‘రైతులు అర్థం చేసు కోవాల్సింది ఏంది అంటే మొక్కజొన్న, జొన్నలను కేంద్రం కొనుగోలు చేయదు. ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తది తప్ప, కొనదు. ఈ వానకాలం నుంచి రాష్ట్రంలోని మక్కలు, జొన్నలను కొనుగోలు చేయరు. పప్పుదినుసులు, నూనె విత్తనాలను సైతం కేంద్రం 25 శాతమే కొనుగోలు చేస్తుంది. మిగతాది బయట అమ్ముకోవాలని చెప్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వరి వేయకండి.. ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని సీఎం, మంత్రులు చెప్తున్నరు. ప్రత్నామ్నాయ పంటలకు ఏమైనా భరోసా ఇస్తున్నరా?’ అని ప్రశ్నించారు. ‘మీ ప్రభుత్వమే కదా మక్కలు, జొన్నలు కొనేది లేదని.. కేంద్రం ఎంత కొనుమంటే అంతే కొంటాం అంటున్నది. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే రైతులు ఆగమే కదా?’ అని నిలదీశారు. ‘మీరు రైతు బిడ్డలైతే తక్షణమే మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
రైతుల జీవితాలతో చెలగాటం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం కొత్తగా ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాని ప్రకారం ఎకరాకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తరట..ఆ రెండు కూడా ఇప్పడు ఒకటి.. నెల తర్వాత ఇంకొకటి ఇస్తరట.. వాటిని కూడా యాప్‌లోనే బుక్ చేసుకోవాలట. మిర్చి పండించే రైతులు ఎకరాకు 6 బస్తాల యూరియా వాడుతరు. మక్క రైతులు 5 బస్తాల వరకు వాడుతరు. రెండు బస్తాలు ఇస్తే మిగతా నాలుగు బస్తాల కోసం రైతులు ఎక్కడికి వెళ్లాలె?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. యూరియా ఇవ్వుమని అడిగిన రైతులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లో పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఇబ్బడిముబ్బడిగా ఎరువుల ధరలు పెంచిదని చెప్పారు. 30 శాతం ఎరువుల ధరలు పెరిగాయని, డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపారని, మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగడం లేదని దుయ్యబట్టారు.
బోనస్‌కు మంగళం
అన్ని పంటలకు బోనస్ అని చెప్పి ఇవ్వాళ మంగళం పాడారని, బోనస్ పూర్తిగా ఎగ్గొట్టారని హరీశ్ మండిపడ్డారు. సన్నాల్లో 33 రకాలకే బోనస్ అని చెప్పి నేడు ఏడు రకాలకే ఇస్తామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇప్పటికే రైతులు నార్లు పోసుకున్నరు. ఇప్పుడా రైతుల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. ఏడు రకాల విత్తనాలు కూడా మార్కెట్లో లేవని తెలిపారు. నిరుడు రూ.1,200 కోట్లు, ఈ యాసంగిలో సన్నాలకు రూ.800 కోట్లు బోనస్‌ను సర్కార్ ఎగ్గొట్టిందని చెప్పారు.
29,358 కోట్ల రైతుబంధుకు ఎగనామం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుకు ఎకరానికో మీటింగ్ పెడుతున్నదని హరీశ్ దెప్పిపొడిచారు. ‘సిద్దిపేటకు మార్చి 22న వచ్చి రైతు బంధు వేస్తున్నానని చెప్పి ఒక్క ఎకరానికి వేసి, జగిత్యాల మీటింగ్‌లో ఒక్క ఎకరానికి వేసి పూర్తిగా రైతుబంధు ఎగ్గొట్టారు. ఇప్పడు కొత్తగా మధిరలో మీటింగ్ పెట్టి వేస్తామని డ్రామాలాడుతున్నరు’ అని నిప్పులు చెరిగారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు బంధు వేస్తానని సిద్దిపేట ప్రజల సాక్షిగా చెప్పినవు. ఏమైంది? 90 రోజులైనా రైతు బంధు ఏది?’ అని నిలదీశారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.15 వేలు వేస్తానని చెప్పి మోసం చేశారని, ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం లెక్క పెడితే 2024-25 వానకాలంలో ఒక్క ఎకరానికి కూడా రైతుబంధు ఇవ్వలేదని మండిపడ్డారు. ‘2024-25 యాసంగిలో మూడు ఎకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్లకు ఎగ్గొట్టినవ్. 2025-26 యాసంగి రెండు ఎకరాల వరకు వేసి మిగతా గుండుసున్నా పెట్టినవ్. మొత్తంగా 5 పంటలు కలిపి రైతుబంధు కింద రూ.29,358 కోట్లు ఎగ్గొట్టినవ్. రైతు అంగీ, బనీను అన్నీ లాక్కున్నవ్.. ఇగ మిగిలిందే ఒక్క గోశి మాత్రమే’ అని నిప్పులు చెరిగారు.
రైతుబీమా ఆగింది నిజమా? కాదా?
‘రైతు బీమా ఆగలేదు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్తున్నరు. జనవరి నుండి ఈ రోజు వరకు రైతుబీమా ఆగిందా? లేదా? చెప్పాలె’ అని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు ఎందుకు రైతు బీమా అందలేదని నిలదీశారు. ‘రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదామో చెప్పండి.. మనమిద్దరం పోదాం..లేదా సిద్దిపేటకు రండి. సిద్దిపేట నియోజకవర్గంలోనే వ్యవసాయశాఖ అధికారులతో రివ్యూ చేస్తే దాదాపు 40 మంది రైతు కుటుంబాలకు బీమా అందలేదు. కారణం ఏందని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ఎల్ఐసీకి ప్రీమియం కట్టలేదు..అందుకే ప్రాసెస్ చేయడం లేదని చెప్పిండ్రు. రైతు కుటుంబాలకు ధీమాగా ఉన్న రైతు బీమాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని’ నిప్పులు చెరిగారు.
రైతులకు భరోసానిచ్చిన కేసీఆర్ సర్కార్
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేసి రైతులకు భరోసా నిచ్చిందని హరీశ్ గుర్తుచేశారు. కేంద్రం వడ్లు కొనకున్నా కేసీఆర్ కొనుగోలు చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోల్లో యూరియా ఇంటికి వచ్చింది. రైతులకు సమయానికి రైతుబంధు అందింది. 11 విడతల్లో రూ.74 వేల కోట్ల రైతు బంధు రైతుల ఖాతాల్లో జమైంది. 10 రోజుల్లోనే రైతు బీమా అందింది’ అని వివరించారు.
ఎన్ని వడ్లు అయినా పండించండి..
అంతా కొంటమని అనేక సార్లు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇవ్వాళ ముఖం చాటేస్తున్నడు. కేంద్రం ఎంత కొనుమంటే గంతే కొంటామంటే మీరెందుకు ఇగ? మీ రైతు డిక్లరేషన్ ఎందుకు? పేపర్ లేస్ క్యాబినెట్ అని గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్ లేస్ క్యాబినెట్ కాదు.. విశ్వాసఘాతుక క్యాబినెట్.
-హరీశ్‌రావు
మన రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతది. కేంద్రం ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నులే కొనుమన్నది అంటున్నవ్.. వచ్చే సంవత్సరం కూడా 50 లక్షల మెట్రిక్ టన్నులే కొనుమంటే గంతే కొంటవా? మిగతా వడ్లు కొనవా? రైతులు పండించిన పంట ఏంగావాలె? మీ ప్రభుత్వంలో రైతుకు భద్రత ఏది? భరోసా ఏది? రైతులను నడి రోడ్డు మీద వదిలి
పెడుతున్నరా? -హరీశ్‌రావు