అమ్రాబాద్, జూన్ 5: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ వరుస దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నది. వనపర్తి జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల హత్యోదంతాలను మరువక ముందే నాగర్‌కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నది. బాధితుల వివరాల మేరకు.. పదర మండలం మద్దిమడుగు మాజీ సర్పంచ్, చెంచు కుటుంబానికి చెందిన ఉడుతల అంజయ్య బీఆర్ఎస్లో చురుకుగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తన వార్డు నుంచి 53 ఓట్ల ఆధిక్యాన్ని తీసుకొచ్చారు. దీంతో అతడిని వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయించాలని పార్టీ నేతలు భావించారు.
ఇది మింగుడుపడని కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అంజయ్య కుటుంబంపై దాడికి దిగారు. అంజయ్యతోపాటు అతడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిపై విచక్షణారహితంగా కట్టెలు, గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో అంజయ్య, తల్లి తిరుపతమ్మ, తమ్ముడు వెంకటేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. తిరుపతమ్మ, తమ్ముడు వెంకటేశ్ అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అంజయ్య పదర దవాఖానలో వైద్యం చేయించుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులైన బస్తా అంజయ్య, చిన్న కోటమ్మ, శివ, ఈదయ్య, హనుమంతుపై పదర పోలీస్‌స్టేషన్‌లో అంజయ్య ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అంజయ్య తన ఫిర్యాదులో కోరారు.