హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 25% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఉన్న రిజర్వేషన్లను సైతం ఊడబీకిందని గీత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన 15% రిజర్వేషన్లు సైతం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేషన్లను కూడా మింగేసిందని దళిత, గిరిజన సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు..
మద్యం దుకాణాల కేటాయింపుల్లో కేసీఆర్ ప్రభుత్వం గీత కార్మికులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున రిజర్వేషన్లు అమలు చేసింది. ఇందుకోసం కేసీఆర్ ప్రభు త్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, ఎక్సైజ్ నిబంధనల్లో సవరణలు చేసి అమలు చేసింది. 2200 దుకాణాలు ఉండగా గీత కార్మికులకు 330 మద్యం దుకాణాలు, దళితులకు 220, గిరిజనులకు 110 చొప్పున కేటాయించింది. ఈ రిజర్వేషన్లతో కొన్ని చోట్ల గౌడ కుటుంబా లు వ్యక్తిగతంగా, చాలా చోట్ల గీత కార్మిక సొసైటీలు మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నాయి. దళిత, గిరిజనులు కూడా మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నారు. తదుపరి విడుదల చేసిన ప్రతి ఎక్సైజ్ నోటిఫికేషన్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉన్న రిజర్వేషన్లు ఊడబీకిన కాంగ్రెస్
ఎన్నికలకు మందు కాంగ్రెస్ గౌడ సామాజికివర్గానికి 25% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ సీఎం రేవంత్రెడ్డి ఉన్న 15% రిజర్వేషన్లనే తొలిగించారని ఆరోపిస్తున్నారు. 25 బార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో తమకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారని గీత కార్మికులు ఆశించారు. కానీ కేసీఆర్ అమలు చేసిన 15 శాతం రిజర్వేషన్లు కూడా తీసేసి ఓపెన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో గౌడ సామాజిక కుటుంబాలు నష్టపోయాయని గీత కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అట్లాగే దళితులకు కేటాయించిన 10శాతం, గిరిజనులకు కేటాయించిన 5 శాతం రిజరేషన్లు కూడా అమలు చేయకపోవటంతో దళిత, గిరిజన సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకొని, కనీసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లతోనైనా బార్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.