Congress-BJP | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ‘లోపల ఆలింగనాలు.. బయట ‘నట’యుద్ధాలు అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైఖరి బయపడింది. ‘కుండ పగిలితే పగిలింది. కానీ, కుక్క సంగతి తెలిసింది’ అనే రీతిలో రెండు పార్టీలు భవిష్యత్తులో రాష్ర్టాన్ని మోసగించే విషయంలో పోటీ పడ్డాయనే విషయం ప్రచారంలో తేటతెల్లమైందని సామాజిక పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రచారం సందర్భంగానైనా తెలంగాణ సమాజానికి పాలు ఏవో.. నీళ్లు ఏవో.. నిజమేదో..అబద్ధమేదో.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలిసిపోయిందని ఉదహరిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో రెండుసార్లు అధికారాన్ని చేపట్టి ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అధికారం కోసం ముందుకొచ్చిన బీజేపీ.. ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాయోనని అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావటమే పరమావధిగా ఆ పార్టీలు పోటాపోటీగా ప్రజలను మభ్యపెట్టాయని, తెలంగాణ అస్తిత్వ ఆరాటాలను, ఆత్మగౌరవ ఆకాంక్షలను పట్టించుకోలేదని వాటి కార్యాచరణ ద్వారా నిరూపించాయని విశ్లేషించారు. భవిష్యత్తుల్లో ఆ రెండు పార్టీలతో తెలంగాణ ప్రయోజనాలకు భారీ ముప్పు వాటిల్లబోతున్నదని వాటి కార్యాచరణనే బహిరంగంగా తేల్చిచెప్పాయని, తెలంగాణ సమాజం ఇప్పుడెలా రియాక్ట్ అవుతుందన్నదే ఆసక్తిగా మారిందన్నారు.
కీలక అంశాలపై పీటముడి
ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు కీలక అంశాలు తెరమీదికి వచ్చాయి. బీఆర్ఎస్ లేవనెత్తిన అనేక అంశాలపై కాంగ్రెస్, బీజేపీ దాటవేత ధోరణినే అనుసరించాయి. తెలంగాణ విషయంలో రెండు జాతీయ పార్టీల వైఖరి ఒక్కటేనని సామాజికవేత్త తేల్చిచెప్పారు. ఆయా అంశాల్లో ఆయన విశ్లేషణ ఇలా ఉంది..