Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్: తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చేసిన అపసవ్యపు వ్యాఖ్యలు ఆ పార్టీకి శాపంలా పరిణమించాయి. ఏ ముహూర్తాన ఆ మాటన్నారో కానీ నాటినుంచి కాంగ్రెస్ గ్రాఫ్ జర్రున జారుతూ కిందపడుతున్నది. హస్తం పార్టీ తీరును అసహ్యించుకున్న జనం ఆ పార్టీ సభలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన అగ్రనేతలు ఈ పరిస్థితిని జీర్ణించు కోలేకపోతున్నారు. ఖాళీ కుర్చీలకే చెప్పాల్సింది చెప్పి వెనుదిరుగుతున్నారు. స్టేజీ దిగాక స్థానిక నేతలపై కస్సుబుస్సుమంటున్నారు. సభల విషయంలో బీజేపీదీ ఇదే తీరు. సాక్షాత్తూ ప్రధాని మోదీ పాల్గొన్న సభలు కూడా జనం లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
‘అంతన్నాడు.. ఇంతన్నాడో.. ’ అన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. ఇదిగిదిగో అధికారంలో వచ్చేశాం అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న రేవంత్ అండ్ కోకు ఎన్నికలకు ముందు ఒకదాని తర్వాత ఒకటిగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుల్తున్నాయ్. ఆ పార్టీ సభలవైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడడం లేదు. అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వచ్చినా ప్రజలు మొఖం చాటేస్తున్నారు. ప్రతిచోటా వారి సభలకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఒకటీ అరా చోట్ల జనం వచ్చిన మధ్యలోనే వెనుదిరుగుతుండడంతో ఖాళీ కుర్చీలవైపు చూస్తూ ప్రసంగించి నిరాశతో నేతలు వెనుదిరుగుతున్నారు. రైతులకు మూడుగంటల కరెంటు చాలంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలే కాంగ్రెస్‌కు శాపంగా మారాయి. ఇక్కడ, అక్కడ అని కాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురవుతున్న అనుభవాలు ఇవి. వెళ్లిన ప్రతిచోట ఇదే సీన్ కనిపిస్తుండడంతో నేతలు నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు.
అక్కడక్కడ ఒకటీ అరా జనం కనిపించినా నేతల ప్రసంగాలకు స్పందనలేకుండా పోయింది. ఈలలు, కేరింతలు మచ్చుకైనా కనిపించలేదు. ఏ అభ్యర్థీ తమ నియోజకవర్గాన్ని వదిలి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు, కాషాయ పార్టీదీ ఇదే తీరు. స్వయంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు వస్తున్నా సరే ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. వెలవెలబోతున్న సభలను చూస్తున్న ఢిల్లీ నేతలు స్థానిక నాయకులపై విరుచుకుపడుతున్నారు. సభ ఏర్పాట్లు ఇలానా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు, బీఆర్ఎస్ మాత్రం రోజురోజుకు దూసుకుపోతున్నది. అన్నిచోట్ల విశేష ఆదరణ లభిస్తున్నది. బీఆర్ఎస్ సభలు ప్రజలతో పోటెత్తుతున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా హాజరవుతున్న ప్రజలు సభ చివరి వరకు ఉంటూ నేతలు చెప్పింది ఆసక్తిగా వింటున్నారు.
రాహుల్, ప్రియాంక సభలు అట్టర్ ఫ్లాప్
ఖమ్మం జిల్లాలో శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నిర్వహించిన రోడ్ షో, బహిరంగ సభలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ నుంచి వరంగల్ క్రాస్‌రోడ్డు వరకు సాగిన రోడ్ షో పేలవంగా సాగింది. జనం లేకపోవడంతో రోడ్ షోలో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మధిర బహిరంగ సభలోనూ ఆమెకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రియాంక ప్రసంగం పూర్తికాక ముందే జనం ఇంటిదారి పట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని నర్సాపూర్ గేట్ వద్ద రాహుల్‌గాంధీ నిర్వహించిన ‘విజయభేరి’ సభ కూడా వెలవెలబోయింది. సభ ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సరిగ్గా పదిరోజుల క్రితం ఙదే స్థలంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆదిలాబాద్‌లోనూ రాహుల్‌కు చేదు అనుభవమే మిగిలింది. రాహుల్ హిందీ ప్రసంగం అర్థం కాకపోవడంతో జనం మధ్యలోనే లేచివెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లాలో శనివారం రెండుచోట్ల బహిరంగ సభలు, ఒకచోట కార్నర్ మీటింగ్ జరగ్గా, ఆమన్‌గల్ బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరైనప్పటికీ జనం నుంచి స్పందన కరువైంది. మూడుచోట్ల సభలు ఫ్లాప్ అయ్యాయి. ఆమన్‌గల్ సభలో వచ్చిన జనం కూడా మధ్యలోనే లేచివెళ్లిపోతుంటే నేతలు బతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. షాద్‌నగర్ సభకు రేవంత్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడం వల్లే రేవంత్ డుమ్మాకొట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. తుర్కయాంజల్ కార్నర్ మీటింగ్ కూడా తుస్సుమన్నది.
రాహుల్ తప్పులను ఎత్తిచూపుతూ పోస్టర్లు
‘తెలంగాణలో ఆత్మబలిదానాలకు బాధ్యత మీదే. మా బిడ్డలను సంపింది మీరే. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే. ముక్కు నేలకు రాయాల్సిందే. కర్ణాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి నిరుద్యోగుల గోస. కరెంట్ లేక అల్లాడుతున్న కర్ణాటక. దివాలా తీస్తున్న పరిశ్రమలు. గీ కన్నింగ్ కాంగ్రెస్ మనకెందుకు? తెలంగాణమా.. తస్మాత్ జాగ్రత్త..!!’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ శుక్రవారం రాత్రికి రాత్రే బోధన్ పట్టణంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. సమాచారం అందుకున్న అధికారులు పోస్టర్లను తొలగించే పనిలో పడ్డారు.
బీజేపీదీ అదే తీరు
కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మైదానంలో శనివారం బీజేపీ నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభకు కూడా ప్రజలు ముఖం చాటేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరైన ఈ సభ ప్రారంభం కాగానే మహిళలు వెళ్లిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సభ కూడా ఫ్లాప్ అయింది. ఈ సభకు కూడా యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఐదువేల మందితో నిర్వహించాలని భావించినా సభ ప్రారంభమైన పది నిమిషాలకే సగానికిపైగా ప్రాంగణం ఖాళీ అయింది. విజయసంకల్ప యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ మొక్కుబడిగా జరిగింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైనా జనం ఆదరించలేదు. ఈ సభ చిన్నపాటి సదస్సును తలపించడంతో కాషాయ పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సభ కూడా తూతూమంత్రంగా సాగింది. ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా ప్రసంగం సాగడంతో జనం ఆసక్తి చూపలేదు.
సకల జనుల్లో సగం ఖాళీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదితాత్యనాథ్ ప్రసంగం అర్థంకాక వచ్చిన కొంతమంది కూడా మధ్యలోనే మాయమయ్యారు.