హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రిజర్వేషన్లపై నిరాశనే మిగిల్చాయని నిప్పులు చెరిగారు.
సచివాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై కేంద్రాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్ ఆపని చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలరోజులు కొనసాగిన పార్లమెంట్ సమావేశాల్లో ఒకరోజు కూడా రాహుల్‌గాంధీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని నిప్పులు చెరిగారు.
కులగణన అంశంలో తెలంగాణ రోల్డ్ మోడల్ అని చెప్పిన కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయస్థాయిలో బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ లేకపోవడం బీసీలపై వారి చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని మండిపడ్డారు. బీహార్ అంశం తప్ప ఇండియా కూటమి నేతలకు ఏమి కనిపించడం లేదని చురకలంటించారు. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
లేదంటే కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పకతప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంధ్య, జగదీశ్‌చారి తదితరులు పాల్గొన్నారు.