మునుగోడు, అక్టోబర్ 23: మునుగోడులో ప్రజలను దొంగదెబ్బ తీసి, కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన తాజాగా బీజేపీలో చేర్చిన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు.. రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు, బండి సంజయ్ సహా అనేక మంది బీజేపీ నేతలను ముఖాముఖి నిలదీశారు. వారి పర్యటనలను, ప్రచారాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత, మరోవైపు ప్రజల నుంచి మద్దతు లభించకపోవటంతో రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురై దాడులకు దిగుతున్నారు. రెండురోజుల క్రితం తనను ప్రశ్నించిన అంజయ్య అనే గ్రామస్థుడిని బూతులు తిట్టిన రాజగోపాల్‌రెడ్డి, ఆదివారం ఏకంగా గ్రామస్థులపై స్వయంగా దాడులు చేయించారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రామస్తులు ఖాళీ వంటగ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఇది సహించలేని రాజగోపాల్‌రెడ్డి.. దాడులు చేయాలంటూ.. తన అనుచరులకు సైగ చేశారని గ్రామస్తులు తెలిపారు. బీజేపీ గూండాల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తుండగా ‘కొట్టండి నా కొడుకులను’ అంటూ చెప్పలేని భాషలో బూతులు తిడుతూ ఇంకా రెచ్చగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఉండి తమ సమస్యలు పరిష్కరించలేదని నిరసన తెలిపిన గ్రామస్తులను రాజగోపాల్‌రెడ్డి దారుణంగా అవమానించారు. ఆదివారం చౌటుప్పల్ మండలం జైకేసారం, ఎస్ లింగోటం గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. జైకేసారంలో రాజగోపాల్‌రెడ్డిని స్థానికులు నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన ఆయన ‘తాగుబోతు కుక్కలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాయి.. మీరేం పట్టించుకోవద్దు.. మనవాళ్లు చూసుకొంటారు. పోలీసులు చూసుకొంటారు’ అంటూ ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. అంతటితో ఆగకుండా రాజగోపాల్ అనుచరులు ఓ గ్రామస్తుడిపై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకొని నిరసన తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో ప్రచారానికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొన్నారు. రాజగోపాల్‌రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు వారిపై దాడులకు పాల్పడ్డాయి.
ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో బీజేపీ శ్రేణులు ప్రజలపై దాడులు చేస్తుండటంతో రాజగోపాల్‌రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లిన స్థానిక నేతల్లో గుబులు మొదలైంది. ఎన్నికలు ముగియగానే రాజగోపాల్ ముఖం చాటేస్తారని, కానీ తాము ప్రజల్లోనే ఉండాలి కాబట్టి వారికి ముఖం ఎలా చూపించాలని మథనపడుతున్నట్టు తెలిసింది. రాజగోపాల్ వెంట బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ‘ఇదేం రాజకీయం? ప్రజలు తమ సమస్యలపై నిలదీస్తే దాడులు చేయటం ఏమిటి? తర్వాత వారికి ముఖం ఎలా చూపిస్తాం? ఈయన చేస్తున్న తప్పులకు మనం బలవ్వాల్సి వస్తున్నది’ అని రాజగోపాల్‌రెడ్డి శిబిరంలోని స్థానిక నేతలు చర్చించుకొంటున్నారని ఆ వర్గంలోని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ దాడుల నేపథ్యంలో రాజగోపాల్ వెంట ఇంకా కొనసాగం ఎంతవరకు సమంజసమనే అనే మీమాంసలో పడ్డారు. ఆత్మవిమర్శ చేసుకొంటున్నారని తెలిసింది. రెండుమూడు రోజుల్లో రాజగోపాల్ శిబిరంలోని మాజీ కాంగ్రెస్ నేతలు తమదారి తాము చూసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంకా ఆయన వెంటనే ఉంటే నిండా మునుగుతామని బహిరంగంగానే అంటున్నట్టు తెలిసింది.
సెప్టెంబర్ 6 : నాంపల్లి మండలం తుంగపహాడ్
సెప్టెంబర్ 11 : సంస్థాన్‌నారాయణపురం మండలం మర్రిగూడ
అక్టోబర్ 12 : చౌటుప్పల్ మండలం అల్లాపురం, ఎర్రగడ్డి తండా..
అక్టోబర్ 13 : మర్రిగూడ మండలం గంగోరిగూడెం, సోలిపురం
అక్టోబర్ 15 : సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ, కోతులాపురం, కొత్తగూడెం, పుట్టపాక
అక్టోబర్ 17వ తేదీ : చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో రాజ్‌గోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, డీకే అరుణడలకు నిరసన. మర్రిగూడ మండల్ రాంరెడ్డిపల్లిలో రాజగోపాల్‌రెడ్డి నిలదీత
అక్టోబర్ 18వ తేదీ : అంతంపేటలో రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. కాంగ్రెస్ కార్యకర్తలపై రాజ్ గోపాల్‌రెడ్డి అనుచరుల దాడి, గూండాగిరి. గట్టుప్పల్ మండలం వెల్మకన్నెలో గూండాగిరి. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి యత్నం.
అక్టోబర్ 21వ తేదీ : సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.
అక్టోబర్ 22వ తేదీ : చౌటుప్పల్ మండలం జై కేసారంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యను అడ్డుకున్న గ్రామస్తులు
అక్టోబర్ 23వ తేదీ : చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు, నేలపట్ల, జై కేసారం, ఎస్.లింగోటంలో అడ్డుకున్న గ్రామస్తులు.. నిరసన తెలిపిన వారిపై బీజేపీ నాయకులు గూండాయిజం.
పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ప్లకార్డులతో మేం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులకు చేయి చూపించి సైగ చేశాడు. వెంటనే ఆయన వెంట వచ్చిన వేరే ప్రాంతాల బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. నా కాళ్లకు దెబ్బలు తగిలాయి.
– డొప్ప నరేశ్, చిన్నకొండూర్
పెరిగిన ధరలపై మేం నిరసన తెలుపుతుంటే దళితుడిని అని కూడా చూడకుండా నాపై దాడి చేశారు. బీజేపీ గూండాలు గుంపు గుంపుగా వచ్చి నాపై చేయిచేసుకున్నారు. చొక్కా పట్టి లాగి కొట్టారు. నా ఛాతీపై దెబ్బలు తాకాయి. బీజేపీ గెలిస్తే గూండాయిజం పెరుగుతుంది. – మహేశ్, చిన్న కొండూర్