హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పథకానికి ఎవరు.. ఏ విధంగా దరఖాస్తు చేయాలనేదానిపై గందరగోళానికి గురవుతున్నారు. దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలుగానీ, దరఖాస్తు నమూనాగానీ విడుదల చేయకపోడమే ప్రజల సందేహాలకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వద్ద కూడా ఇప్పటివరకూ స్పష్టత లేకపోవడం గమనార్హం. రెండురోజుల ముందే గ్రామాలకు దరఖాస్తులను అందిస్తామని, ఎవరు ఏ పథకానికి అర్హులో వారు దరఖాస్తు ఫారం నింపి అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల తెలిపారు. కానీ మంగళవారం రాత్రివరకు కూడా గ్రామాలకు దరఖాస్తు ఫారాలు అందలేదు. గురువారం (ఈ నెల 28) నుంచి ప్రజాపాలన పేరిట గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ప్రజలు ఆగమవుతున్నారు.
అభయహస్తంలో భాగమైన మహాలక్ష్మి, గృ హజ్యోతి, చేయూత, రైతు భరోసా, ఇందిర మ్మ ఇండ్ల గ్యారెంటీలకు సంబంధించి ప్రభు త్వం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు పేర్కొ న్నది. ఈ ఐదు గ్యారెంటీల్లో తొమ్మిది హామీలు ఉన్నాయి. అన్ని గ్యారెంటీలకు కలిపి ఒకే దరఖాస్తు తీసుకుంటారా? లేక గ్యారెంటీలవారీగా విడిగా దరఖాస్తులు తీసుకుంటారా? అనే సం దేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హామీల్లో కొన్ని విడి విడిగా వ్యక్తులకు సంబంధించినవి మరికొన్ని కుటుంబం మొత్తానికి సంబంధించినవి ఉన్నాయి. మహాలక్ష్మిలో భాగమైన రూ.2500 మహిళలకు, రైతు భరోసా రైతులకు, చేయూత వృద్ధులకు ప్రత్యేకమైనది. ఇందులో గృహజ్యోతిలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కుటుంబానికి సంబంధించినవి. ఈ నేపథ్యంలో మహిళలు వ్యక్తిగత పథకాలకు ఒక దరఖాస్తు, కుటుంబ పథకానికి సంబంధించి మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుందా? లేక అన్నింటికి ఒకే దరఖాస్తు సరిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు అసలు దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పథకానికి తెల్ల రేషన్‌కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి దరఖాస్తుకు రేషన్‌కార్డుతోపాటు ఆధార్‌కార్డును జత చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేషన్‌కార్డుల వివరాలు, అందులోని లబ్ధిదారుల వివరాలు పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నాయి. ఇందులో మహిళలు ఎంతమంది? పురుషులు ఎంతమంది? అనే వివరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గృహజ్యోతిలో భాగమైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ విషయంలోనూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రేషన్‌కార్డుదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ల వివరాలు సివిల్ సైప్లె వద్ద ఉన్నాయి. వాటిని క్రోడీకరించి ఈ పథకం అమలు చేస్తే సరిపోతుంది. అయినా మళ్లీ దరఖాస్తు తీసుకుంటున్నది. రైతుభరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకుంటామని ప్రకటించింది. గత ప్రతి సీజన్లో రైతుబంధు విడుదలకు ముందు కొత్త రైతుల వివరాలను ఆయా ఏఈవోలు సేకరించి వారిని రైతుబంధు జాబితాలో చేర్చారు. ఇలాంటప్పుడు మళ్లీ దరఖాస్తు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రైతులతో సమానంగా కౌలురైతులకు కూడా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో భాగంగా రైతుభరోసాకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కొత్త రైతులకు సంబంధించి దరఖాస్తుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ కౌలు దరఖాస్తుపై స్పష్టత కరువైంది. అసలు కౌలురైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. మిగిలిన పథకాలకు రేషన్‌కార్డును ప్రామాణికంగా ప్రకటించిన ప్రభుత్వం కౌలురైతుల దరఖాస్తుకు ఎలాంటి నిబంధనలను విడుదల చేయలేదు. గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో గ్రామ సభల్లో కౌలురైతులు దరఖాస్తు చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఏ ఆధారాలు సమర్పించాలనే దానిపై స్పష్టత కొరవడింది.