Congress Govt | మంచిర్యాల/హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ పిల్లలాటను తలపిస్తున్నది. ప్రభుత్వ కొలువులు భర్తీ చేస్తున్నామన్న సోయి లేకుండా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తప్పుల మీద తప్పులు చేశారు. ఫలితంగా టీచర్ల నియామకాల్లో రోజుకో జిల్లాలో.. పూటకో వివాదం వెలుగుచూస్తున్నది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థికి టీచర్ కొలువు ఇచ్చినట్టే ఇచ్చి నెల రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు.
25 రోజులపాటు టీచర్‌గా విధులు నిర్వహించిన ఆయా టీచర్‌ను నెల తిరగకుండానే తొలగించడంతో ఇప్పుడు ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆది లాబాద్ జిల్లాలోనూ ఓ అభ్యర్థికి మొదట ఉద్యోగమిచ్చి ఆ తర్వాత తొల గించారు. తాజాగా స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికెట్ల అంశం వెలుగులోకి వచ్చింది. బీకాం అభ్యర్థులకు ఎస్ఏ సోషల్స్టడీస్ పోస్టుకు అర్హతలపై అభ్యంతరాలు రాజుకున్నాయి. డీఎస్సీ భర్తీపై రోజుకో చోట రచ్చకు దారితీస్తున్నది.
ఖమ్మం జిల్లాలో ఏడుగురు హిందీ పండిట్లకు టీచర్ ఉద్యోగమిచ్చి, 22 రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అర్హత లేదనే సాకుతో వారిని టెర్మినేట్ చేశారు. తాజాగా వెలుగుచూసినవి కొన్ని మాత్రమేనని, ఇలాంటివి మరికొన్ని జరిగి ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ప్రభుత్వం హవావిడిగా పూర్తి చేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నదనే ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ 30న ఫలితాలిచ్చి.. అక్టోబర్ 9న నియామకపత్రాలిచ్చారు.
దసరాలోగా పోస్టులు భర్తీ చేయాలంటూ 15 రోజులు చేయాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను హడావుడిగా ఐదు రోజుల్లోనే పూర్తి చేశారు. దీంతో తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. అక్టోబర్ 7 రాత్రికల్లా 1:1 జాబితాలు సిద్ధం కాలేదు. ఆ రోజు ఉన్నతాధికారులు నిద్రపోలేదంటే ఎంత ఒత్తిడికి గురయ్యారో అర్ధం చేసుకోవచ్చు. తొలుత జాబితాలు సిద్ధంచేసినా తప్పులు వెలుగుచూడటంతో రెండు సార్లు మార్పులు చేశారు. ఆఖరుకు అక్టోబర్ 8న సాయంత్రం తర్వాత 1:1 జాబితాలు సిద్ధం చేశారు.
రాష్ట్రంలో 33 జిల్లాలుండగా ఐదారు జిల్లాలకే రెగ్యులర్ డీఈవోలున్నారు. మిగిలిన జిల్లాలకు ఇన్చార్జి డీఈవోలు ఉన్నారు. దీంతో కొ న్ని జిల్లాల్లో అవగాహన లేక, మరికొన్ని జిల్లా ల్లో కావాలనే పొరపాట్లు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏమైనా చర్యలు తీసుకుంటే డీఈవో పోస్టు నుంచి తొలగిస్తారు. ఎలాగు పాత పోస్టులో పనిచేసుకోవచ్చన్న ధీమాతో కొందరు డీఈవోలు బరితెగించి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కోవలోనే ఇటీవలే మహబూబ్‌నగర్‌లో ఇన్చార్జి డీఈవో రూ. 50వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి దొరికాడు. కొన్ని జిల్లాల్లో దీని వెనుక ముందస్తు ప్రణాళిక ఉందన్న ప్రచారం జరుగుతున్నది. డీఈవోలు కావాలనే చేసినట్టుగా అనుమానాలొస్తున్నాయి. ‘ముందు మేం ఉద్యోగమిస్తాం. ఆ తర్వాత ఏవైనా అభ్యంతరాలొస్తే తొలగి స్తాం. ఆ తర్వాత మీరు హైకోర్టుకెళ్లండి. అప్పు డు కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత మీరు మళ్లీ ఉద్యోగంలో చేరవచ్చు’ అంటూ కొన్ని జిల్లాల్లో డీఈవోలు ఆఫర్లు ఇచ్చినట్టుగా ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉట్నూరు లావణ్యకు డీఎస్సీ-2024లో గత నెల 16న ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెరకాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్జీటీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇదే జిల్లా లో జీ భార్గవి ఎస్జీటీ తెలుగు మీడియం క్యా టగిరీలో 125వ ర్యాంకును సాధించారు. ఆమె సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సైతం హాజరయ్యారు. కానీ భార్గవి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరయ్యారని కారణంగా చూపించి ఆమె పేరును జాబితా నుంచి తొలగించా రు. భార్గవి తర్వాత ర్యాంకు సాధించిన క ల్లూరి శ్రీనివాస్(165వ ర్యాంకు), లావణ్య (257వ ర్యాంక్)కు పోస్టింగ్ ఇచ్చారు. తన కు ఉద్యోగం రాకపోవడంతో కంగారుపడిన భార్గవి అధికారులను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తప్పును గ్ర హించిన అధికారులు సాంకేతిక కారణమం టూ లావణ్యను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వ్యవహరంలో తప్పంతా అధికారులదే. ఇప్పుడు ఆ ఉద్యోగం చేజారడంతో లావణ్య కన్నీరుమున్నీరవుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో డీఎస్సీ రిక్రూట్మెంట్లో అనేక తప్పిదాలు జరిగాయి. తప్పుడు ఆప్షన్స్ పెట్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. దాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓయూ కామర్స్ డిపార్ట్మెంట్ డీన్ బీ కామ్‌లో కామర్స్ తప్ప ఇతర ఆప్షనల్ సబ్జెక్టులు ఉండవని ఆర్టీఐ ద్వారా మాకు స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కానీ బిజినెస్ ఎకనామిక్స్‌ను ఎకనామిక్స్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో మాకు అన్యాయం జరిగింది. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి. లేదంటే మేం కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తాం.
– సీహెచ్ రాజేందర్, డీఎస్సీ అభ్యర్థి, మంచిర్యాల
పదిహేను రోజులు చేయాల్సిన డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ పెట్టిన ఆప్షనల్ సబ్జెక్టులకు, డిగ్రీ సర్టిఫికెట్లలోని ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధమే లేదు. ఇవన్ని సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌లో గుర్తించలేదు. దీంతో బీఏ, బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. మా పోస్టులు మాకు ఇప్పించాలి.
– అంజయ్య, డీఎస్సీ అభ్యర్థి, బెల్లంపల్లి