రంగారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ): జిల్లా విద్యాశాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన సీనియారిటీ జాబితాలో లోపాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ముఖ్యంగా.. సీనియారిటీ లిస్టులో ఓ ఉపాధ్యాయురాలి పేరు చివరి నిమిషంలో గల్లంతుకావడంతో రెండు నెలల్లో రిటైర్మెంట్ కాబోతున్న సదరు ఉపాధ్యాయురాలికి తీవ్ర అన్యాయం జరిగినట్ల్లయింది. గత నెలలో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తర్వాత మిగిలిపోయిన ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ 60 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియారిటీ లిస్ట్‌ను ఇటీవల విడుదల చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ రాజీవ్ గృహకల్పలోని ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న కే అలివేలు ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అధికారులు సీనియారిటీ లిస్ట్‌లో చేర్చి జాబితాను విడుదల చేశారు.
అందులో మొదటి పేరు సదరు టీచర్దే కాగా.. ఆదివారం వెబ్ ఆప్షన్‌కు గడువు ముగియనుండగా..ఆప్షన్ పెట్టుకునేందుకు పోర్టల్‌లో చూడగా అలివేలు పేరు కన్పించలేదు. అభ్యంతరాలు రావడం వల్ల జాబితా నుంచి పేరు తొలగించినట్టు అధికారులు చెబుతున్నారని సదరు ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 1988లో టీచర్‌గా నియమితులైన అలివేలు మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. పదోన్నతి కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును డీఈవో స్వీకరించి జాబితాలో చేర్చిన తరువాత తొలగించడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. డీఈవో సుశీందర్‌రావును వివరణ కోరగా.. అలివేలు దరఖాస్తుపై అభ్యంతరాలు రావడంతో జాబితా నుంచి పేరును తొలగించినట్టు తెలిపారు.