హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-కార్ రేస్ నిర్వహించామని, ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ-కార్ రేస్‌ను తొలిసారి బ్రహ్మాండంగా నిర్వహించామని, మరుసటి ఏడాది కోసం రూ.46 కోట్లు ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా పంపించామని, ఆ మొత్తం సదరు సంస్థకు చేరిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పంపించిన మొత్తం అక్కడకు చేరిన తర్వాత.. ఇక అవినీతికి తావులేదని, అందుకే దీనిని లొట్టపీసు అంటున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం కావాలని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. నిజాయతీగా పనిచేయడం వల్లే దేశంలో ఏ రాజకీయ నాయకుడు అడగకున్నా తానే లైడిటెక్టర్ టెస్ట్ కోరుతున్నానని అన్నారు. ‘నా మీద ఏసీబీ కేసు ఉన్నది. రేవంత్‌రెడ్డి మీద కూడా ఏసీబీ కేసు ఉన్నది. రేవంత్‌రెడ్డి వస్తరా? ఏసీబీ డీజీ వస్తరా.. లైవ్ కెమెరాలు పెట్టండి.. లైడిటెక్టర్ టెస్ట్ పెట్టండి. దూద్‌కా దూద్.. పానీకా పానీ తేల్తది. రాష్ట్ర ప్రజలు చూస్తరు.
నువ్వు బ్యాగులు మోసినవా లేదా? పైసలు పంచినవా? లేదా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా? లేదా? నువ్వు చెప్పు.. నేను చెప్త. ఎవరు నిజం చెప్తున్నరు? ఎవరు అబద్ధం చెప్తున్నరో లైడిటెక్టర్ రాష్ట్ర ప్రజలు చూస్తరు. అని కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ నందినగర్‌లో మంగళవారం ఈ-కార్ రేస్ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచడానికి బరాబర్‌గా ఈ-కార్ రేస్ నిర్వహించినం. తొలి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. మరో రెండేండ్లు జరుగాల్సి ఉండే. కానీ ఆపేశారు. హైదరాబాద్‌లో మొబిలిటీ వ్యాలీ, పరిశ్రమలు రావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎదుగుతున్న ఈవీ రంగంలో ప్రోత్సాహకాలు రావడానికి ఈ-కార్ రేస్‌తో ఒక ముందడుగు వేసినం. రేస్‌ను ఆకర్షణగా పెట్టాం. ప్రభుత్వం నుంచి రూ.46 కోట్ల కట్టాలని ఆదేశాలు ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పిన. ప్రభుత్వం నుంచి రూ.46 కోట్లు బ్యాంకు ద్వారా పోయినయి. అవతలివారి దగ్గర ఉన్నయి. రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతీ రూపాయికి అక్కడ లెక్క ఉంటే.. ఇక అవినీతి ఎక్కడిది? అవినీతిని నిరోధించడానికి శాఖ ఎక్కడిది? ఏ చార్జిషీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకుంటరో వేసుకోండి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు
తాను ఏ తప్పు చేయలేదని, రాష్ర్టానికి ప్రతిష్ఠ తెచ్చే ప్రయత్నం మాత్రమే చేశానని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా, రైతుల తరపున కొట్లాడుతం, మహిళల తరఫున కొట్లాడుతం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం గాక వదిలిపెట్టం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలయ్యే వరకు నిలదీస్తూనే ఉంటం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఏసీబీ కేసు పెట్టి, లీకులు ఇచ్చి ఏం చేద్దామనుకంటున్నరని ప్రశ్నించారు.