మహదేవపూర్, జూలై 19 : అధికారుల పర్యవేక్షణ లోపంతో బీసీ హాస్టల్ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో సరైన వసతులు లేక విద్యార్థులు అరిగోస పడుతున్నారు. హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో వీధి కుక్కలు హాస్టల్ గదుల్లో సంచరిస్తూ అక్కడే తిష్టవేస్తున్నాయి. వంటశాలలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. విద్యార్థులు భోజనం చేస్తున్న గదుల్లో నిద్రిస్తున్నా వాటిని తరిమే వారు లేరు. కుక్కలను తరిమితే దాడి చేస్తాయనే భయంతో నిస్సహాయ స్థితిలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చుట్టుపక్కల చెత్తాచెదారం పేరుకుపోవడంతో పందులు, దోమల బెడద ఎక్కువైంది. దీంతో విద్యార్థులు రాత్రి వేళల్లోనూ నానా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై హాస్టల్ వార్డెన్ సాంబయ్యను వివరణ కోరగా హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో కుక్కలు, పశువులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిపారు.