నాంపల్లి కోర్టులు, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్‌రావు, అదనపు డీఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్న తరఫున దాఖలైన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల (తప్పనిసరిగా)పై 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్లను దాఖలు చేసిన సమయానికి కోర్టులో చార్జిషీట్ లేదని, 90 రోజులు పూర్తికావడంతో డిఫాల్ట్ బెయిల్ మం జూరు చేయాలని నిందితుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఏడు కారణాలతో చార్జిషీట్‌ను తిప్పి పంపించినట్టు మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య వెల్లడించారు. భుజంగరావు, తిరుపతన్నకు చెందిన చార్జిషీట్లను కోర్టుకు దాఖలు చేశారని జడ్జి తెలిపారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి బదులిస్తూ.. ఒక్కసారి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేస్తే సరిపోతుందని, బెయిల్ పిటిషన్లను దాఖలు చేసినప్పుడు కోర్టు లో చార్జ్జిషీట్ లేదనడం సమంజసం కాదని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు గురువారానికి తీర్పును రిజర్వు చేసింది.
కోర్టుకు హార్డ్‌డిస్క్‌లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు సేకరించిన ఎలక్ట్రానిక్ వస్తువులను సాక్ష్యాధారాల కింద కోర్టుకు అందజేశారు. వాటితోపాటు కొన్ని సీడీలు, పెన్‌డ్రైవ్‌లను సాక్ష్యాధారాలుగా పరిగణించాలని కోరారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు జూలైలో వస్తున్నట్టు మెయిల్ ద్వారా తెలియపర్చినట్టు సమాచారం. మీడియా ప్రతినిధి శ్రావణ్‌కుమార్ విదేశాల్లో ఉండటంతో అధికారులు వీరిద్దరికీ వారెంటు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సీరియస్
ముస్తాబాద్, జూన్ 26: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సీరియస్ అయ్యారు. రెండ్రోజుల కిందట నామాపూర్ శివారులో ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న కానిస్టేబుల్‌ను హతమార్చేలా ఇసుక స్మగ్లర్లు వ్యవహరించిన తీరుపై.. ‘ఇసుక మాఫియా బరితెగింపు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం కథ నం ప్రచురితంకాగా కలెక్టర్ స్పందించారు. ఎగువ మానేరు వాగు పరిసర గ్రా మాల నుంచి ఇసుక అక్రమ మా ర్గాలకు చెక్ పెట్టాలని, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తహసీల్దార్ సురేశ్‌కుమార్ ను ఆదేశించారు. తహసీల్దార్‌తోపాటు రెవెన్యూ అధికారులు, పోలీసులు రామలక్ష్మణపల్లె, కొండాపూర్ గ్రామాల శివారులోని మానేరు వాగు ఒడ్డు పరిసర ప్రాం తాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాగు నుంచి ఇసుక తరలించకుండా రహదారులకు అడ్డుకట్ట వేశారు. మార్గాల్లో జేసీబీలతో కందకాలు తీయించి ట్రాక్టర్లు వెళ్లకుండాచేశారు.