హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ): ఈ నెల 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం) అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించినా, దవాఖానల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వాస్తవంగా నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్యం అందడమే లేదని తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గుండవరం దేవీప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలతో ఈహెచ్ఎస్ అమలుపై ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన నెలకొన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం పారదర్శంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నూతన పథకం ద్వారా 4,440 మంది లబ్ధి పొందారని ప్రభుత్వం చెప్తున్నా.. లబ్ధిదారుల పేర్లు, చికిత్స అందించిన దవాఖానలు, అందించిన వైద్యచికిత్సలు, ఖర్చుల వివరాలను తక్షణమే అధికారిక వెబ్సైట్లో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి మే నెల నుంచే ఈహెచ్ఎస్ ప్రీమియం వసూలు చేసి, ఆగస్టు 17 నుంచి పథకాన్ని అమలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
అన్ని ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లోనూ నగదు రహితంగా ఈహెచ్ఎస్ ఓపీ (ఓపీ ) సేవలను అందుబాటులోకి తేవాలని దేవీప్రసాద్ కోరారు. పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకోసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయాలని కోరారు. తక్షణమే ఇన్‌పేషెంట్, ఓపీ క్యాష్‌లెస్ సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని , ఈ సమస్యల పరిషారానికి సీఎం స్పందించి జేఏసీ (జాక్) ప్రతినిధులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.