హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య శాఖలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ దంతవైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 42, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో 6 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూన్ 26న నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు.. సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ నెల 25 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. పరీక్షలో క్వాలిఫై అయిన వారికి 80 పాయింట్లు కేటాయిస్తామని ప్రకటించింది. మిగతా 20 పాయింట్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దవాఖానాల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే కేటాయిస్తామని తెలిపింది. ఇందులో ప్రతి 6 నెలల సర్వీస్‌కు 2.5 పాయింట్ల చొప్పున కలుపుతామని వెల్లడించింది.
మొత్తం 20 పాయింట్లు పొందాలంటే కనీసం నాలుగేండ్లపాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సేవలు అందించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఈ నిబంధనలపై దంతవైద్య విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించేవారికి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని వాపోతున్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసేవారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేకపోవడం వల్లనే ప్రభుత్వం 20 మార్కుల నిబంధన తెచ్చిందని మండిపడుతున్నారు. ఈ నిబంధన వల్ల తాము పూర్తిగా నష్టపోతామని 2021-25 మధ్య కాలంలో ఉత్తీర్ణులైన దంతవైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు 20 పాయింట్ల విధానాన్ని తొలగించాలని, అందరికీ కామన్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి 100 పడకల దవాఖానకు నలుగురు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒకరు చొప్పున దంత వైద్యులను నియమించేందుకు వీలుగా పోస్టుల సంఖ్య పెంచి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.