భద్రాచలం, మే 24: నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు, విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నర్సింగ్ కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ ఎలా మృతి చెందిందో చెప్పాలని? ప్రభుత్వ దవాఖాన మార్చురీ నుంచి నర్సిం గ్ కళాశాల వరకు ర్యాలీ తీశారు. భద్రాచలంలోని ఓ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్టియర్ చదువుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్దిక్నగర్కు చెందిన పగిడిపల్లి కారుణ్య గురువారం కళాశాల ఆవరణలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిం ది. శుక్రవారం ఆమె కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావుపై దాడికి యత్నించారు. పట్టణ సీఐ సంజీవరావు నేతృత్వంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కారుణ్య బంధువులు సంప్రదించడంతో కళాశాలకు వచ్చిన ఆయన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కారుణ్య కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించడంతో బంధువులు ఆందోళన విరమించారు.