హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : జూనియర్ కాలేజీల్లో కంప్యూటరైజ్డ్ తనిఖీలకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ.. ప్రైవేట్ కాలేజీలన్న తేడాల్లేకుండా దసరా తర్వాత అన్ని కాలేజీల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. కంప్యూటరైజ్డ్ తనిఖీల్లో అధికారుల ప్రమేయం అంతగా ఉండదు. ఆన్లైన్ సిస్టమే ర్యాండమ్‌గా తనిఖీలను కేటాయిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈనెల 26న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ (మెగా పీటీఎం) నిర్వహించనున్నట్టు తెలిపారు. పత్యేకావసరాలు గల పిల్ల ల కోసం ఇంటర్లో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. విద్యానగర్/ సీతాఫల్మండి, సరూర్‌నగర్, కుత్బుల్లాపూర్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో స్పెష ల్ హెచ్ఈసీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.