హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి అర్హులైన వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు చేనేత,జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలోనే నూతన పథకాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ) ఏర్పాటుకు, హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేనేత రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మంగళవారం మంత్రి ఒక ప్రకటనలో వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు 10శాతం యార్న్ సబ్సిడీ కింద రూ.33.23కోట్లు విడుదల చేసినట్టు, మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు 2024-25బడ్జెట్లో రూ.400కోట్లు కేటాయించినట్టు, బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా ఈ నిధులను వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి అనుమతించారని చెప్పారు. అన్ని ప్రభుత్వశాఖలు టెసో ద్వారా వస్ర్తాలు కొనుగోలు చేసేందుకు మార్చి 11న ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు.
టెస్కో ద్వారా నాన్ ఎవైలబులిటీ సర్టిఫికెట్ తీసుకోకుండా ఏ ప్రభుత్వ శాఖైనా ప్రైవేటు మార్కెట్లో వస్ర్తాలు కొనుగోలు చేసే అవకాశం లేదని మంత్రి స్పష్టంచేశారు. ఫలితంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెసోకు వచ్చాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రాథమిక చేనేత సహకార సంఘాల ద్వారా రూ. 53కోట్ల విలువైన వస్ర్తాలను కొనుగోలు చేసినట్టు, పేమెంట్లు కూడా వెనువెంటనే చేస్తున్నట్టు చెప్పారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం నూలు కొనుగోలుకు 50 శాతం అడ్వాన్సుగా సుమారు రూ. 50 కోట్లు విడుద చేసినట్టు మంత్రి వివరించారు.