Dasari Manohar Reddy | ‘మానవత్వ పరిమళం.. సమాజ హితమే ఆయన అభిమతం.. హరిత నియోజకవర్గమే లక్ష్యంగా ఇంటింటికీ అయిదు పండ్ల మొక్కలను అందజేసి సీఎం చేత శభాష్ అనిపించుకున్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు పుస్తె మట్టెలు అందజేసి పెద్దన్నగా నిలుస్తున్నారు. సొంత డబ్బులతో అంబులెన్స్‌ను కొని ఇచ్చారు. చిరువ్యాపారుల రక్షణకు గొడుగులు ఇచ్చి అందరివాడుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు మనోహర్‌రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తన సొంత డబ్బులు రూ. కోటితో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ 5 రకాల పండ్ల మొక్కలను అందజేశారు. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనోహర్‌రెడ్డిని హరితమిత్ర అవార్డుతో సత్కరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటింటా పచ్చదనం వెల్లివిరియాలనే ఉద్దేశంతో కడియం, అశ్వారావుపేట, భీమారం, సంగారెడ్డిల నుంచి ప్రత్యేకంగా మొక్కలను తెప్పించి పంపిణీ చేశారు. ఇంటింటా దాసరి అందించిన పండ్ల మొక్కలు ఇప్పుడు ఫలాలను అందిస్తున్నాయి. ప్రజలకు ఇండ్లల్లోనే అంజీరా, బొప్పాయి. సపోటా, జామ, దానిమ్మ వంటి ఫలాలు అందుతున్నాయి. అవి ప్రజల ఆరోగ్యానికి గొప్ప వరంగా మారాయి. హరితహారంలో భాగంగా తన సొంత డబ్బులను ఖర్చు చేసి సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో మైసమ్మగుట్టపై పెద్దఎత్తున హరితహారం మొక్కలను నాటి హరిత ఎమ్మెల్యే అయ్యారు.
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా తన సొంత డబ్బులతో అంబులెన్స్‌ను అందజేశారు. పెద్దపల్లి పట్టణంలో వీధుల పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే 150మందిని ఎండ, వాన నుంచి రక్షణ పొందడానికి గొడుగులను అందజేశారు. నియోజకవర్గంలో నిర్మించే ప్రతి ఆలయానికీ తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు పెద్దన్నగా సాయం అందిస్తున్నారు. పెండ్లిళ్లకు పుస్తెమట్టెలతో పాటు ఆర్థిక సాయం చేస్తున్నారు. బియ్యం, ఇతరత్రా పెండ్లి సామగ్రిని అందజేస్తున్నారు. పేదలు ఎవరైనా ఇండ్లు కట్టుకున్నా.. ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో ముందుంటూ, నియోజకవర్గ ప్రజల మనసును గెలుచుకున్నారు.