హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మళ్లీ మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి అందించిన సాయం, ఇంకా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది. డాక్టర్ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌ల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 20,387 మంది వరద బాధితులను గుర్తించామని, వారికి అవసరమైన సాయం అందజేయనున్నామని తెలిపారు. రాష్ట్రమంతటా 49 మంది మరణిస్తే 23 కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసిందని చెప్పారు. మిగిలిన కుటుంబాల వారసులను గుర్తించగానే వారికి కూడా సాయం అందజేస్తామని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.