బంజారాహిల్స్, జూలై 26: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ నెల 18న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు.. బావిలో దూకి చావు.. పెట్రోల్ పోసుకుని చావు.. మీ కుటుంబసభ్యులు కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోండి’ అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధ్దమైన సీఎం పదవిలో ఉంటూ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ఆత్మహత్య చేసుకోవాలంటూ దుర్భాషలాడిన రేవంత్‌రెడ్డి మీద వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. న్యాయసలహా అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు గోవర్ధన్‌రెడ్డికి తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.