కులకచర్ల : గిరిజన జాతికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) క్షమాపణ చెప్పాలని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్‌నాయక్ అన్నారు. ఏప్రిల్ 24న రెట్రో ( Retro ) సినిమా ఫ్రీ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవర కొండ గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడటం పట్ల గిరిజన విద్యార్థి సంఘం ( Tribal Student Union ) ఆధ్వర్యంలో సోమవారం కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కులకచర్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులపై అనుచితంగా మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండు చేశారు. 5వందల సంవత్సరాల కిందట గిరిజనులు బుద్ధి లేకుండా కొట్టుకున్నారనే వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఎస్టీలకు క్షమాపణ చెప్పడంతో పాటు గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్‌సేవాలాల్ మహారాజ్ పాదాలమీద పడి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లెడ్ చౌదర్‌గూడెం మండల గిరిజన యువనాయకులు ఆకాశ్‌నాయక్, వికారాబాద్ జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టునాయక్, కులకచర్ల మండల ప్రధాన కార్యదర్శి గణేశ్‌నాయక్, సేవాలాల్ సేనా మండల అధ్యక్షులు అంగూర్‌నాయక్, హన్మ్యనాయక్, మాజీ సర్పంచ్ రవినాయక్, అరుణ్, శ్రీను, గోపాల్, బాలకృష్ణ, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.