హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐఏఎస్ అధికారి, బయోడైవర్సి టీ బోర్డు కార్యదర్శి కాళీచరణ్ ఎస్ ఖర్ట్రడే ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ)కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్అల్వాల్కు చెందిన రాజేశ్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఏఎస్ కాళీచరణ్ ఈ ఏడాది ఆగస్టు 19న అద్వైత్ బయో ఫ్యూయల్ ప్రొప్రైటర్ సాయిమిత్ర దిట్టకవిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆ ఫిర్యాదు ప్రకారం.. కాళీచరణ్ అద్వైత్ బయోఫ్యూయల్ సంస్థలో రూ.35 లక్షలు పెట్టుబడిగా పెట్టారని, లాభాల్లో వాటాగా ప్రతి నెల ఆరు శాతానికిపైగా తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తనకు డబ్బులు ఇవ్వడం ఆపేశారంటూ ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ జరిపి, సాయిమిత్రను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. దీనిని బట్టి తాను వ్యాపారంలో పెట్టుబడి పెట్టానని ఐఏఎస్ కాళీచరణ్ స్వయంగా ఒప్పుకున్నట్టేనని రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది ఆలిండియా సర్వీసెస్ నిబంధనల్లోని 13, 14లో ఉన్న పలు సెక్షన్లను ఉల్లంఘించడమేనని చెప్పారు.