హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో ఆహార పదార్థాల ఆర్డర్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ విభాగం పలు చర్యలు చేపట్టింది. ‘ఫుడ్ యాప్’ల్లోనూ కల్తీ ఆహారంపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొన్నది. ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో హోటల్ లేదా బేకరీకి రేటింగ్ ఇస్తున్నట్టుగానే.. కల్తీ ఆహారం గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసేలా ఆప్షన్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నది.