హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ) : మొంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఓంకార్ భవన్లో శుక్రవారం జరిగిన సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుఫానుతో లక్షలాది మంది అన్నదాతల కుటుంబాల బతుకులు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. పంట చేతికొచ్చే దశలో అధిక వర్షాలు, తుపాన్ వల్ల రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని తెలిపారు. ఈ తుపానుతో రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లోనే సుమారు 10 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. లెక్కల్లో సగమే నష్టపోయినట్టు అంచనా వేశారని, క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలు సేకరించాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ): మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న లక్షలాది ఎకరాల పంట నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. పంటల వారీగా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వివరాలను ప్రదర్శించాలని ఆయన కోరారు.