టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి త్వరలోనే ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. టీఎస్ ఆర్టీసీ పాలక మండలి సమావేశం శనివారం జరిగింది.
కారుణ్య నియామకాల కింద సుమారు 12 వందల మందికి ఉద్యోగాలిస్తామని, అతి త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. ఇక… అతి త్వరలో ఒకవెయ్యి 60 కొత్త బస్సులను కూడా కొనుగోలు చేస్తామని బాజిరెడ్డి ప్రకటించారు. డీజిల్ సెస్, టోల్ సెస్ పెంచే విషయంలోనూ బోర్డు అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక… జిల్లాల్లో కూడా ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రవేశపెడతామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే మొదట సిటీలో ప్రవేశపెట్టిన తర్వాతే.. జిల్లాలకు పంపుతామని అన్నారు. దీనికి కొన్ని సాంకేతిక అనుమతులు కావాలని, వాటి కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. 1,060 కొత్త బస్సులకు తాము టెండర్ వేశామని తెలిపారు. ఇక… తార్నాకలోని ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.