SLBC Tunnel Incident | మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొని రావడానికి అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్‌ను కట్ చేయాలనే విషయంపై సర్కార్‌కు, జేపీ కంపెనీ ప్రతినిధులకు మధ్య పొంతన కుదరలేదన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సదరు కంపెనీ మిషన్ కటింగ్‌కు ఒప్పుకోకపోవడంతో సహాయక చర్యల్లో ప్రతిష్ఠంభణ ఏర్పడిందా? చివరకు సర్కారుకు, కంపెనీ ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందా? అందుకే హడావిడిగా డిప్యూటీ సీఎంను పంపించి ఇద్దరు మంత్రులతో బేరసారాలకు దిగారా? అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం గత శనివారం ఉదయం కుప్పకూలింది.
అప్పటికే ఉబికి వస్తున్న ఊట నీరు కారణంగా సొరంగం కూలే అవకాశం ఉన్నదని భావించిన కార్మికులు లోపలికి వెళ్లి పనిచేయడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా లోపలికి తీసుకువెళ్లారు. అసలు లోపలికి ఎంతమందిని తీసుకెళ్లారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఆ రోజు సొరంగం పనులు చేయడానికి వెళ్లిన కార్మికులు ఎంతమంది? రిజిస్టర్లో ఎంట్రీ లు చేశారా? అక్కడ పనిచేస్తున్న వారి విషయంలో సేఫ్టీ మేజర్స్ ఎందుకు పాటించలే దు? అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ఇటీవల ఒక ప్రజాసంఘం నాయకులు కార్మికులు ఉంటున్న క్యాంపుల దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత కంపెనీ దగ్గర వివరాలు సేకరించా రు. ఇటు కార్మికులు, అటు కంపెనీ చెప్తున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. కార్మిక చట్టాలను ఉల్లంఘించి, వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా బలవంతంగా పనుల్లోకి తీసుకెళ్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.