హైదరాబాద్ : తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని కంపా నేషనల్ సీఈవో సుభాష్ చంద్ర ప్రసంశించారు. కంపా నిధులతో మంచి ఫలితాలను రాబడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, పట్టణ ప్రాంత అడవుల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు అభినందనీయమన్నారు. జాతీయ సదస్సులో భాగంగా ఇతర రాష్ట్రాల పీసీసీఎఫ్‌లతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారు కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్‌తో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు పచ్చదనం, అవెన్యూ ప్లాంటేషన్, తదితర అంశాలను పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్‌లో సౌకర్యాలు బాగున్నాయంటూ ప్రశంసించారు.
ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను, నిబంధనల మేరకు వినియోగిస్తూ తెలంగాణ అటవీ శాఖ మంచి ఫలితాలు సుభాష్ చంద్ర ప్రశంసించారు. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అన్నారు. ఉత్తర ప్రదేశ్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) సంజయ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ.. విపరీతమైన పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించేందుకు అర్బన్ పార్కులు లంగ్ స్పేస్‌లుగా పని చేస్తాయన్నారు. తెలంగాణ అటవీశాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్య జోషి మాట్లాడుతూ తెలంగాణ అటవీ శాఖ పనితీరు చాలా ఆదర్శవంతంగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని అన్నారు. తమ రాష్ట్రంలో ఆక్సిజన్ పార్కు తరహాలో అర్బన్ ఫారెస్ట్
పార్కుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై సుమారు 70 కిలో మేటర్ల ఈ బృందం పర్యటించి, పచ్చదనాన్ని పరిశీలించింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్‌ను వివిధ రాష్ట్రాల పీసీసీఎఫ్‌లు అధ్యయనం చేశారు. ఇంటర్ ఛేంజ్‌ల వద్ద ఉన్న గ్రీనరీ నిర్వహణ, ఓఆర్ఆర్పై ఏర్పాటు చేసిన బొమ్మలను చూసి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, టేబుల్ క్యాలెండర్లను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ వారికి అందజేశారు.
మరో నెలరోజుల్లో దాదాపు 160 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్పై గ్రీనరీ నిర్వహణ కోసం డ్రిప్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీఎఫ్‌లు, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, తెలంగాణ అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు జోజి, జానకి రామ్, వెంకటేశ్వర్లు, శంషాబాద్ డివిజనల్ ఆఫీసర్ విజయానంద్ పాల్గొన్నారు.