చిన్నారుల కంటిచూపు కబళిస్తున్న‘మయోపియా’
‘మీ పిల్లలు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారా? పుస్తకాలను చదవడంలోనూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వారు ‘మయోపియా’ (హస్వ దృష్టి) బారిన పడ్డారేమోనని అనుమానించండి.
- ఫోన్లు, టీవీలతో ఎక్కువగా గడపడమే కారణం
- 2050 నాటికి పదిమందిలో ఐదుగురికి ఈ సమస్య
- ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘మీ పిల్లలు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారా? పుస్తకాలను చదవడంలోనూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వారు ‘మయోపియా’ (హస్వ దృష్టి) బారిన పడ్డారేమోనని అనుమానించండి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చిన్నపిల్లలు ఎక్కవ సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. గంటలపాటు ఆన్లైన్ గేమ్స్, యూట్యూబ్ వీడియోలు అంటూ స్క్రీన్‌పై నుంచి కండ్లను పక్కకు తీయడంలేదు. ఆన్లైన్ క్లాసులకూ మొబైల్ ఫోన్‌ను వాడం తప్పనిసరైంది. దీంతో చిన్నారుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 2050 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది పిల్లల్లో ఐదుగురికి (48%) మయోపియా వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందిపై దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. దీన్ని తొలిదశలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపు సైతం పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు సూర్యకాంతికి దూరంగా ఉండటం, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి పరిస్థితులు కూడా మయోపియాకు దారితీస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. చిన్న వయసులోనే మయోపియాకు గురైన పిల్లల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని, దాదాపు 4% భారతీయ మయోపియా రోగులకు శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉన్నదని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేశ్ కెకున్నయ, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఇన్ఫోర్ మయోపియా కేంద్రం అధిపతి డాక్టర్ పవన్ వెంకిచెర్ల తెలిపారు. మయోపియా ఉన్న చిన్నపిల్లలు చూపు అస్పష్టంగా ఉన్నదని తమంతట తాము చెప్పలేనందున వారికి వార్షిక కంటిపరీక్షలు చేయించడం తప్పనిసరి అని వారు సూచించారు.
మయోపియా సమస్య సాధారణ లక్షణాలు
- దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం.
- కండ్లు చికిలించి చూడటం.
- తరచుగా తలనొప్పి అని చెప్పడం.
- పుస్తకాలను లేదా వస్తువులను ముఖానికి చాలా దగ్గరగా పట్టుకోవడం. టీవీని చాలా దగ్గర నుంచి చూడటం
- బ్లాక్‌బోర్డ్‌పై అక్షరాలను చదవడానికి ఇబ్బంది పడటం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- స్రీన్‌ను చూసే సమయం తగ్గించి పచ్చదనాన్ని ఎకువ చూసేలా చూడాలి.
- పగటిపూట ఆరుబయట కార్యకలాపాలను ప్రోత్సహించాలి. సహజ సూర్యకాంతి మయోపిక్కు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది.
- స్క్రీన్ చూసే సమయంలో లేదా ఏదైనా వస్తువును దగ్గరగా చూసే సందర్భంలో ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల విరామం తీసుకొనేలా చూడాలి.
- మధ్యమధ్యలో 20 అడుగుల దూరంలో ఏదైనా వస్తువును చూడటం వల్ల కంటి సిలియరీ కండరాలు సడలి స్క్రీన్‌పై చూసే సమయంలో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది.
- ఆన్లైన్ క్లాసులప్పుడు 12 నుంచి 16 ఏండ్ల వయసు వారిని 8 గంటల కంటే ఎక్కువసేపు ఫోన్ చూడనివ్వొద్దు.
- చిన్న పిల్లలకు మాత్రం 4 గంటల వరకే పరిమితం చేయాలి.
- చంటి పిల్లలు, మూడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు డిజిటల్ పరికరాన్ని వినియోగించకుండా చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

