హైదరాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో వివాదాస్పదంగా మారింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఏడుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుచేయాలని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటయ్యే ఇందిరమ్మ కమిటీకి చైర్మన్‌గా ఆ గ్రామ సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటారు. మున్సిపల్ వార్డు కమిటీ చైర్మన్‌గా ఆ వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌ను, కన్వీనర్‌గా వార్డు ఆఫీసర్‌ను నియమిస్తారు. వీరితోపాటు ఇద్దరు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్న మరో ముగ్గురితో కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఆ ముగ్గురిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ సామాజికవర్గాల నుంచి తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించడం, చైతన్యం తీసుకొనిరావడం, ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంలో లబ్ధిదారులకు అండగా నిలవడం, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించడం తదితర బాధ్యతలను ఈ కమిటీలు నిర్వర్తించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా కమిటీల జాబితాను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని, శనివారంలోగా కలెక్టర్లు కమిటీలను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. జిల్లా ఇన్చార్జి మంత్రులను సంప్రదించి కలెక్టర్లు ఆయా కమిటీలను ఖరారు చేయాలని స్పష్టంచేసింది. శనివారం దసరా పండుగ అని కూడా చూడకుండా పేర్లు ఇచ్చేందుకు ఒక్కరోజే గడువు విధించడంపై ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలదే పెత్తనం
ఇందిరమ్మ కమిటీ పేరుతో గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ నాయకుల అనధికార పెత్తనం రుద్దే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటారు. గ్రామంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడం వారి బాధ్యత. కానీ, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చే విధంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా ఇదే విధంగా కమిటీలను ఏర్పాటుచేయడంతో అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాకుండా, ఇందిరమ్మ కమిటీల ఎంపిక వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకుండా ఇన్చార్జి మంత్రి ద్వారా మంజూరు చేసే అధికారాన్ని కల్పించారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చే జాబితాకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు స్పష్టమవుతున్నది.
ఉత్తర్వుల జారీలో అధికారుల నిర్లక్ష్యం
ఉత్తర్వుల జారీలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటమైంది. పట్టణ వార్డు కమిటీకి సంబంధించిన మార్గదర్శకాల్లో ‘వార్డుకు సంబంధించిన ముగ్గురిని’ అని కాకుండా ‘గ్రామం నుంచి ముగ్గురిని’ ఎంపిక చేయాలని సూచించడం గమనార్హం. ఉన్నతాధికారుల సరియైన పర్యవేక్షణ లోపించడం వల్లనే కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఈ విధంగా తప్పులతడకగా ఉత్తర్వుల కాపీలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.