హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వీటికి ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు చైర్మన్లుగా.. కలెక్టర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్/మున్సిపల్ కమిషనర్, ఎస్పీ, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), డీఆర్డీవో, డీటీడీవోలు సభ్యులుగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులుగా ఉంటారు. జిల్లా సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇవి అటవీ భూములను పరిరక్షించడంతోపాటు కొత్తగా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతాయి. పోడు వ్యవసాయం జరుగుతున్న భూములను గుర్తించి, వాటికి సంబంధించిన సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీచేశారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
దీర్ఘకాలంగా పోడు రైతుల కష్టాలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్య పరిష్కారం కోసం జీవో 140ని విడుదల చేశారు. పోడుభూముల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇందుకోసం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. దీంతో ఏజెన్సీలోని ఆదివాసీలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో ప్రకారం అర్హత కలిగిన పోడు రైతులందరికీ త్వరలోనే పట్టాలు అందజేస్తాం. ఆదివాసీల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.
–ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయం. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీల ఏర్పాటుతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు న్యాయం జరుగుతుంది. భూమిపై వారికి హక్కులు లభించి, అభద్రతా భావం తొలగిపోతుంది. అడవి బిడ్డలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములను సాగుచేసుకొని ఆర్థిక స్వాలంబన సాధించవచ్చు. – టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు, చంద్రావతి