హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల గుర్తింపునకు, విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ఎం కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములునాయక్, మోతె శోభన్‌రెడ్డి సభ్యులుగా కమిటీని ఏర్పాటుచేస్తూ శుక్రవారం జీవో జారీచేసింది. ఈ కమిటీకి సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. ఉద్యమకారులను గుర్తించేందుకు ఈ కమిటీ స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలి. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను ఈ కమిటీయే సిద్ధంచేయాలి. అనంతరం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలన్న అంశాలపై సర్కార్‌కు సిఫార్సులు చేయాలని సూచించింది.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభు త్వం వేసిన కమిటీలో నాడు లాఠీదెబ్బలు తిన్న బాధిత విద్యార్థులకు చోటేది? అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. కానీ, ఉద్యమకారులపై రేవంత్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. కమిటీని రద్దుచేసి నాటి తెలంగాణ ప్రత్యేక పోరాటంలో కీలకభూమిక పోషించిన వారికి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు.