హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సృష్టి’ సరోగసీ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐవీఎఫ్ క్లినిక్‌ల్లో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమించాలని హెల్త్ సెక్రటరీకి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
మాతృత్వం కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని ఐవీఎఫ్, సరోగసీని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సభ్యులుగా కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కమిటీ నేతృత్వంలో ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించనున్నారు. ఐవీఎఫ్ సెంటర్ల అనుమతులు, రిజిస్ట్రేషన్ల గడువు వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను పదిరోజుల్లో పూర్తి చేసి, పూర్తి నివేదికను అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.