న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం ఇచ్చేలా నిబంధనలు రూపొందించారని, ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రధాని నేతృత్వంలోని కమిటీకి విశేష అధికారాలు కట్టబట్టారనే విమర్శలు వస్తున్నాయి. రాజ్యసభలో ఈనెల 10న ప్రవేశపెట్టిన ‘ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల(నియామకాలు, సర్వీసుల నిబంధనలు, పదవీకాలం) బిల్లు-2023’ ప్రకారం.. కమిషనర్ల నియామకంపై క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ షార్ట్‌లిస్టు చేసిన పేర్లను కాదని, ఇతర పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్రధాని నేతృత్వంలోని ప్యానల్‌కు ఉన్నది. ఈ మేరకు ప్రతిపాదిత కొత్త చట్టంలోని సెక్షన్ 8(2)లో నిబంధనలు రూపొందించారు.
సెక్షన్ 8(2)తో ఆ అధికారం..
బిల్లులోని సెక్షన్ 6 ప్రకారం క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరు సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదు పేర్లతో షార్ట్‌లిస్టు తయారు చేసి, పరిశీలన కోసం ప్రధాని ప్యానల్‌కు పంపుతారు. అయితే వీరు పంపిన పేర్లను ప్రధాని నేతృత్వంలోని కమిటీ అంగీకరించాల్సిన అవసరం లేదు. వేరే పేర్లను కూడా ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకొనేందుకు ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్ 8(2) అధికారం కట్టబెడుతున్నది. సెక్షన్ 7(1) ప్రకారం.. ప్రధాని ప్యానల్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి సీఈసీ, ఈసీల నియామకం చేపడుతారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేకుంటే.. ఉన్న ప్రతిపక్షాల్లో అతిపెద్ద పక్షంగా ఉన్న పార్టీ నేత ప్యానల్లో సభ్యుడిగా ఉంటారని కొత్త బిల్లు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో అవగాహన ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ర్యాంకు స్థాయిలో పనిచేసిన లేదా పనిచేస్తున్న అధికారుల పేర్లను సీఈసీ, ఈసీ నియామకానికి పరిగణనలోకి తీసుకొంటారని ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్ 5 పేర్కొన్నది.
కమిటీలో సీజేఐ తొలగింపుపై విమర్శలు
ప్రతిపాదిక చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేసే కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని తొలగించారు. ఆ స్థానాన్ని అధికార పక్షంలోని క్యాబినెట్ మంత్రితో భర్తీ చేయడం గమనార్హం. దీంతో ముగ్గురు సభ్యు లు ఉండే ఈ ప్యానల్లో అధికార పక్షం నుం చి ప్రధాని, ప్రధాని నామినేట్ చేసే క్యాబినెట్ మంత్రి ఉంటారు. మూడో సభ్యుడిగా ప్రధాన ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంలో ప్యానల్లో మెజార్టీగా ఉ న్న అధికార పక్ష సభ్యుల ప్రతిపాదనలు నెగ్గే అవకాశం ఉన్నది. కాగా, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్ నుంచి సీజేఐని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది ఎన్నికల సంఘా న్ని ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మార్చే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత ప్రజాస్వామ్య విలువలను కేంద్రంలోని బీజేపీ బలహీనం చేస్తున్నదని విపక్షాలు మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టాయి.