 
                                                            హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): వేల కోట్ల రూపాయల మేర మోసగించిన నిందితుడిని రూ.2 కోట్లు లంచం తీసుకొని వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక విచారణలో ఎస్సై లంచం తీసుకున్నట్టు కొన్ని ఆధారాలు లభించడంతో చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఇంకా ఎంతమంది పాత్ర ఉన్నదనే దానిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. వివిధ రంగాలలో పెట్టుబడుల పేరుతో సుమారు రూ.3 వేల కోట్ల వరకు వివిధ రాష్ర్టాలలో మోసం చేసిన ఘరానా మోసగాడిపై నెల రోజుల క్రితం సీసీఎస్‌లో మరో కేసు నమోదయ్యింది.
సాప్ట్వేర్, మద్యం రంగాలలో పెట్టుబడుల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి మోసం చేశాడంటూ ఓ ప్రముఖ వ్యక్తి కొడుకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల్లో కదలిక మొదలైంది. నిందితుడిని పట్టుకొచ్చే బాధ్యతను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ బృందానికి అప్పగించారు. ముంబైలో నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొస్తుండగా.. సదాశివపేట వద్ద తప్పించుకొని పారిపోయాడని ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తన తోటి బృందానికి, ఉన్నతాధికారులకు చెప్పాడు. అయితే నిందితుడు పారిపోవడానికి ఎస్సై రూ.2 కోట్లు తీసుకొని సహకరించినట్టు ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. దీంతో ఎస్సైని నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు.
ఒక ఎస్సై అంత పెద్ద డీల్ చేశాడంటే నమ్మశక్యంగా లేదని దీనివెనుక కొందరు తమ అధికారుల అండదండలు ఉండే అవకాశాలు పక్కాగా ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సైని సస్పెండ్ చేయడం వరకే ఈ కేసు పరిమితమవుతుందా? లేక అతనికి సహకరించిన వాళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
                            