హైదరాబాద్, జూలై27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ విచారణను కమిషన్ ఇప్పటికే పూర్తిచేసింది. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన అన్ని విభాగాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, కాగ్ అధికారులు వెల్లడించిన అంశాలను, సమర్పించిన డాక్యుమెంట్లతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఎస్ఏ నివేదికలను కమిషన్ అధ్యయనం చేసింది. రాజకీయ ప్రముఖులను విచారించింది. అన్నింటినీ క్రోడీకరించి జస్టిస్ ఘోష్ నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆదివారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కమిషన్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో రెండ్రోజుల్లో జస్టిస్ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని సమాచారం.