ఖైరతాబాద్, అక్టోబర్ 19: క్యాన్సర్ బాధితులకు అవసరమైన కీమోథెరపీ కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో అత్యాధునిక డే కేర్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి యూనిట్ రాష్ట్రం మొత్తం మీద నిమ్స్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి రావడం విశేషం. దీనిద్వారా కీమోథెరపీలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోనున్నాయి. చికిత్స మరింత తేలిక అవుతుంది. కీమోథెరపీని దవాఖానలోనే వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. కీమో ఖరీదైనది. కీమోథెరపీ తర్వాత కనీసం ఒకటి రెండ్రోజులు దవాఖానలో ఉండాల్సి వస్తుంది. నిమ్స్ దవాఖానలోని ఆంకాలజీ విభాగానికి ప్రతి నిత్యం వందలాది క్యాన్సర్ బాధితులు వస్తుంటారు. అందులో రోజూ 30 నుంచి 40 మంది కీమోథెరపీ చేయించుకొంటారు. ఇప్పటివరకు నిమ్స్‌లో కీమోథెరపీని బెడ్‌పై ఉంచి నిర్వహించే వారు.
కీమో జరిగే సమయంలో, ముగిసిన తర్వాత ఏ పనీ చేసుకొనే వీలు ఉండదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఒకరోజు ముందుగానే వచ్చే బయట రూములు తీసుకొని ఉండాల్సి వచ్చేది. నూతనంగా నెలకొల్పిన ఆధునిక డే కేర్ యూనిట్‌తో ఇలాంటి బాధలు తొలగిపోనున్నాయి. పేషెంట్లు చైర్లో కూర్చొనే చికిత్స తీసుకోవచ్చు. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చైర్లపై కూర్చొని చికిత్స తీసుకొంటూనే పేపరు చదువుకోవచ్చు. ఆహారం సైతం తీసుకోవచ్చు. ఈ చైర్లకు అనేక ప్రత్యేకతలు ఉ న్నాయి. రోగికి అనుగుణంగా మల్చుకోవచ్చు. చికిత్స సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే నిరంతరం పర్యవేక్షించేందకు ఇన్ఫ్యూజన్ పంప్, కార్డియాక్ మానిటర్‌ను అనుసంధానం చేశారు. చికిత్స తీసుకొన్న రోజే డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోవచ్చు.
ఆరోగ్యశ్రీలో ఉచిత సేవలు
కీమోథెరపీ పేదలకు కొంత భారమే. ప్రైవేట్ దవాఖానల్లో అధిక మొత్తంలోనే ఫీజులు తీసుకొంటారు. నిమ్స్‌లో ప్రస్తుతం ఉన్న డే కేర్ యూనిట్లో నామమాత్రపు ఫీజుతో పేమెంట్ రోగులకు చికిత్స అందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ, నిమ్స్ యాజమాన్యం కృషితో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం కీమోథెరపీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతం రోజుకు 30-40 మంది రోగులకు చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అధునిక చైర్లలో మరో 20 మందికి చికిత్స అందించే వీలుంది. అదేరోజు చికిత్స తీసుకొని అదేరోజు డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చు.
-డాక్టర్ సదాశివుడు, ఆంకాలజీ విభాగాధిపతి, నిమ్స్ దవాఖాన