హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీసీ ఆత్మగౌరవ భవనాల పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మం త్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. వేల కోట్ల విలువైన స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నదని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి గంగుల సోమవారం బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
బీసీ ఆత్మగౌరవ భవనాలను అత్యాధునిక హంగులతోపాటు ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా తీర్చిదిద్దాలని సూచించారు. మౌలిక వసతుల కోసం ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్స్‌తో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, ఎక్కడా జాప్యం లేకుండా, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్పొరేషన్ల ద్వారా బీసీ, ఎంబీసీలకు ఇవ్వనున్న సబ్సిడీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.603 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. అందుకు యా క్షన్ ప్లాన్ విధివిధానాలను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. బీసీ గురుకుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని సంతృప్తి వ్యక్తంచేశారు. జేఈ ఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అడ్వాన్స్ పరీక్ష కోసం శిక్షణ కూడా అందించాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మహాత్మా జ్యోతిబాఫూలే వెనకబడిన వర్గాల గురుకుల విద్యాలయాల సొసై టీ కార్యదర్శి మల్లయ్య భట్టు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.