హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలన్న ఆదేశాలను అమలు చేయని అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించి ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, భువనగిరి ఆర్డీవో, తురపల్లి ఎంపీడీవో, ఎమ్మార్వోలను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నిలదీశారు.
ఈ వ్యవహారంపై ఆగస్టు 8న వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేశారు. తురపల్లి మండలం గోపాలపల్లిలో వాటర్‌ట్యాంకు, పాఠశాల, బస్టాండ్ నిర్మాణం కోసం సేకరించిన భూమి యజమానికి పరిహారం చెల్లించాలని 2022 ఆగస్టులో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో వారికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.