హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ )/నిజామాబాద్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరోసారి తెలంగాణకు వచ్చినప్పుడు సరైన హోంవర్ చేసుకొని రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. ఆదివారం వరంగల్లో హిమంత బిశ్వశర్మ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై కవిత ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. 2014 నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా అని, ఆ దిశగా బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్న రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30వేల ప్రభుత్వ ఉదగ్యోగాలు డైరెక్టుగా కల్పించడం జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికి ఎనిమిదేండ్లు కావొస్తున్నదని, మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సంస్థ లెక్కల ప్రకారం భారత్లో నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8 శాతానికి పెరిగిందని విమర్శించారు. బంగ్లాదేశ్ (5.3 శాతం), మెక్సికో (4.7 శాతం), వియత్నాం (2.3 శాతం) లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్లో నిరుద్యోగం రేటు అధికంగా ఉన్నదని వెల్లడించారు. కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నదని, రాష్ర్టానికి వచ్చినప్పుడు మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ నేడు దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అమలు అవుతున్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు.