
నల్లగొండ : కొలంబో కంది సాగు ఓ రైతు ఇంట కాసులు కురిపిస్తోంది. ఎకరాకు రూ. 40 వేల ఆదాయం సమకూరుతోంది. మునుగోడు పరిధిలోని చల్మెడ గ్రామానికి చెందిన నెల్లికాంతి రాఘవేందర్ అనే యువ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో కొలంబో కంది సాగు చేస్తున్నాడు. గత నాలుగేండ్ల నుంచి ఈ సాగును చేస్తున్న ఆ యువ రైతు లాభాల బాటలో పయనిస్తున్నాడు. వరి, పత్తి పంటలకు వచ్చే ఆదాయం కంటే అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ యువ రైతును దాదాపు 100 మంది రైతులు ఫాలో అవుతున్నారు.
రాఘవేంద్ర తన డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం కోసం వేచి చూడలేదు. తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ప్రతి ఏడాది వరి, పత్తి పంట వేసి నష్టపోతుండటాన్ని గమనించిన రాఘవేందర్.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాడు. ఒక ఎకరా – ఒక పంట – ఒక లక్ష ఆదాయం వచ్చేలా సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనలో భాగంగానే కొలంబో కంది సాగు వేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఓ స్నేహితుడి ద్వారా శ్రీలంక నుంచి కొలంబో కంది విత్తనాలను తెప్పించుకున్నాను. ఈ విత్తనాలు ఆరేండ్ల పాటు సంవత్సరానికి రెండు పంటలను ఇస్తాయని తెలిపాడు. కొంలబో కంది 146, 147, 156, 282 రకాలను సాగు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ కంది సాగులో అంతర పంటగా ఉల్లి సాగు చేస్తున్నట్లు చెప్పాడు. మొత్తంగా ఏడాదికి ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువుర రైతులు రాఘవేంద్ర వద్ద వచ్చి కొలంబో కంది సాగు వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ యువ రైతు నుంచి కంది విత్తనాలు తీసుకెళ్లి.. 500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
మార్కెట్లో కంది పంటకు మంచి డిమాండ్ ఉందన్నాడు. ఈ నేపథ్యంలో మంచి ఆదాయం కూడా వస్తుందన్నాడు. వరి, పత్తి పంట సాగుతో పోల్చితే కొలంబో కంది సాగుకు తక్కువ పెట్టుబడి ఖర్చు అవుతుందని రాఘవేంద్ర తెలిపాడు.